జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీమ్ రాష్ట్ర అవతరణ వేడుకలపై సమీక్ష నిర్వహించారు. జూన్ 2న నిర్వహించే కార్యక్రమాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే నిర్వహించనున్నట్లు కలెక్టర్ అబ్దుల్ అజీమ్ తెలిపారు. జిల్లాలో నిర్వహించనున్న వేడుకలకు ప్రభుత్వ విప్ (శాసన మండలి) భాను ప్రసాద్ రావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని వెల్లడించారు. ప్రోటోకాల్ ప్రకారం నిర్ణీత సంఖ్యలో ప్రజా ప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొనేలా ఏర్పాటు చేయాలని సూచించారు.
వేడుకల ప్రణాళిక
జూన్ 2వ తేదీ నాడు ఉదయం 8:30 గంటలకు భూపాలపల్లి పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు నివాళి అర్పించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. అనంతరం 9 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో జాతీయ పతాకం ఎగర వేస్తారని తెలిపారు. కార్యక్రమం ఉదయం 10 గంటల లోపు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి థర్మల్ స్క్రీనింగ్ చేయాలని, మాస్కు, శానిటైజర్ లను అందించాలని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ స్వర్ణలత, అదనపు కలెక్టర్ రాజావిక్రమ్ రెడ్డి, డీఎస్పీ సంపత్ రావు, జడ్పీ సీఈఓ శిరీష, కలెక్టర్ కార్యాలయ ఏవో మహేశ్ బాబు, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, భూపాలపల్లి తహసిల్దార్ అశోక్ కుమార్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: భాగ్యనగర శివారులో విజృంభిస్తోన్న కరోనా