జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలోని జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లతో వీడియో సమావేశంలో మాట్లాడారు. జూన్ 1 నుంచి 8 వరకు గ్రామాల్లో నిర్వహించనున్న పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ గురించి ప్రజా ప్రతినిధులకు అవగాహన కల్పించారు. రానున్న వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టనున్న కార్యక్రమాల గురించి ప్రజా ప్రతినిధులకు వివరించారు. గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించి మురుగు కాల్వలు, బురద గుంటలను శుభ్రంగా ఉంచాలని, గుంతల్లో నిల్వ నీరు ఉండకుండా చూసుకోవాలని సూచించారు. తాగునీటి ట్యాంకులు శుభ్రం చేసి.. వాటర్ పైప్లైన్ లీకేజీలు లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రతీ ఇంటికి మిషన్ భగీరథ తాగునీరు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
దోమల నివారణకు ఫాగింగ్ చేయాలని, దోమలు గుడ్లు పెట్టకుండా మురుగు కాల్వలు, గుంతల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. ప్రజల్లో సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం సంపూర్ణంగా నిర్వహించే బాధ్యత గ్రామ సర్పంచులదే అని జెడ్పీ ఛైర్మన్ జక్కు శ్రీహర్షిణి అన్నారు. కరోనాను నివారించాలంటే.. భౌతిక దూరం పాటిస్తూ.. మాస్కులు ధరించాలని, తరచూ శుభ్రంగా చేతులు కడుక్కోవాలని ఆమె సూచించారు. జిల్లాలో పండిన వరి ధాన్యం పూర్తిగా కొన్నామని, రైతులకు ఎలాంటి నష్టం రానివ్వకుండా కొనుగోళ్లు చేపట్టామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాజావిక్రమ్ రెడ్డి, డిపిఓ చంద్రమౌళి, జెడ్పీ సిఈవో శిరీష, డీఆర్డీవో సుమతి, డిఎల్పీవో సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: తెలంగాణపై కరోనా పంజా... నిన్న ఒక్కరోజే 169 కేసులు