రైతు మేళాలు నిర్వహించి వ్యవసాయ సాంకేతికతపై రైతుల్లో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీమ్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ అధ్యక్షతన... ఆత్మ పాలకమండలి సమావేశం జరిగింది. ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేస్తూ జిల్లాలోని రైతులను సాంకేతికత వ్యవసాయపై చైతన్యవంతం చేయాలన్నారు.
జిల్లా ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో కిసాన్ మేళాలు నిర్వహించకపోవడం శోచనీయమని కలెక్టర్ అన్నారు. 'ఆత్మ' ద్వారా ఈ నెల చివరి వారంలో జిల్లాలోని భూపాలపల్లి డివిజన్లో 2, మహాదేవపూర్ డివిజన్లో 2 ప్రాంతాల్లో కిసాన్ మేళాలు నిర్వహించి... సాంకేతిక వ్యవసాయంపై శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు.
ఉద్యానవన పంటలతో రైతులకు అధికంగా రాబడి వచ్చే అవకాశం ఉన్నందున... అన్నదాతలను ప్రోత్సహించాలని, పాడి పరిశ్రమపై రైతులకు ఆసక్తి కలిగించేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వైవీ గణేష్, వ్యవసాయ శాఖ ఏడీ శ్రీనివాస రాజు, ఎల్డీఎం శ్రీనివాస్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ, మత్స్య శాఖ అధికారి భాస్కర్, వ్యవసాయశాఖ టెక్నికల్ ఏవో దేవేందర్ రెడ్డి, హార్టికల్చర్ అధికారి అనిల్, ఆత్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.