వరిధాన్యం కొనుగోలులో అవకతవకలు జరగకుండా ప్రత్యేక నిఘా బృందాలు కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి నిబంధనల ప్రకారం కొనుగోలు చేయని నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం ఆదేశించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్లో వరి ధాన్యం కొనుగోలుపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. వరిధాన్యం కొనుగోలులో తాలు పేరుతో కోతలు పెడుతున్నారనే ఫిర్యాదుతో ప్రత్యేకంగా గురువారం చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి మండలాల్లో 45 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధికారులు తనిఖీలు చేశారని తెలిపారు. అధికారులు వరిధాన్యం తూకంలో తేడా రాకుండా రైతులకు న్యాయం చేశారని కలెక్టర్ వెల్లడించారు.
ఇదేవిధంగా జిల్లాలోని మిగతా మండలాల్లో కూడా ఆకస్మిక తనిఖీలు చేసి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి నివేదిక అందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో ప్యాడి క్లీనర్లు, టార్పాలిన్లు సిద్ధంగా ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రైస్ మిల్లులు తక్కువ ఉన్నందున పెద్దపెల్లి జిల్లాలోని రైస్ మిల్లులకు ధాన్యం తరలిస్తున్నామని తెలిపారు. అక్కడ రైస్మిల్లులలో అవకతవకలు జరగకుండా అధికారులు పర్యవేక్షించాలని జిల్లా పాలనాధికారి అబ్దుల్ అజీం ఆదేశించారు.
ఇవీ చూడండి: పోతిరెడ్డిపాడు అంశంపై రజత్ కుమార్కు వినతిపత్రం