జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని చిట్యాల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కాయకల్ప అవార్డులో రాష్ట్రస్థాయి రెండో స్థానాన్ని పొందడంపై వైద్యారోగ్య శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీమ్ అభినందనలు తెలిపారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా చిట్యాల ఆస్పత్రిలో పారిశుద్ధ్య కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించారని గుర్తు చేశారు.
వైద్య సిబ్బంది నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలను అందిస్తూ.. ప్రభుత్వ వైద్యసేవలపై ప్రజల్లో నమ్మకం కలిగించిందని.. అందుకే.. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ 2019-20 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సీహెచ్సీ కేటగిరిలో రాష్ట్రంలోనే రెండో స్థానం లభించిందని కలెక్టర్ అన్నారు.
వైద్య సేవలను అందించడమే గాక.. పారిశుద్ధ్య కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులను, సిబ్బందిని అభినందించారు. జిల్లాలో ఉత్తమ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా రేగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రశంసనీయ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుగా మహదేవపూర్ మండలంలోని అంబటిపల్లి, టేకుమట్ల మండలంలోని వెలిశాల, మహాముత్తారం, మొగుళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఎన్యూహెచ్ఎం కింద భూపాలపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రం ఎంపికైనట్టు జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో త్వరలోనే పూర్తిస్థాయి వైద్య సేవలు: ఈటల