పాలనలో పారదర్శకత, వేగం, ఖచ్చితత్వం కోసం ఈ-ఆఫీస్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య తెలిపారు. ఇకపై జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ఆఫీస్ పద్ధతిలోనే పాలన నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అవగాహన కోసం అవసరమైతే ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు.
కలెక్టర్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రతి అధికారి తమ శాఖ నిర్వహిస్తున్న పనుల వివరాలపై పూర్తి అవగాహన కలిగి ఉండటంతో పాటుగా ఫైళ్లను సక్రమంగా నిర్వహించాలన్నారు. గతంలో ప్రజావాణి కార్యక్రమం ద్వారా స్వీకరించి.. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించాలన్నారు. పరిష్కారానికి తగు చర్యలు తీసుకొని దరఖాస్తుదారులకు అందించాలని ఆదేశించారు.
వివిధ శాఖల్లో ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టుల వివరాలు, ప్రస్తుతం రెగ్యులర్, కాంట్రాక్ట్ బేసిక్, ఔట్ సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్న వారి వివరాలు, ఖాళీల వివరాలను అందించాలని పేర్కొన్నారు. మండల ప్రత్యేక అధికారులు వారి మండలాల్లో వారానికి కనీసం ఒక్కసారైనా పర్యటించి ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలైన పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు, షెగ్రిగేషన్ షెడ్లు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డ్ల నిర్మాణ పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో భూపాలపల్లి ఆర్డీవో శ్రీనివాస్, కలెక్టర్ కార్యాలయ ఏవో మహేష్ బాబు, జిల్లా అధికారులు, వివిధ సెక్షన్ల అధికారులు, తదితరులు పాల్గొన్నారు..
ఇవీ చదవండి: ధాన్యం కొనుగోలు కేంద్రాలు సమర్థవంతంగా నిర్వహించాలి : గండ్ర