దేశాభ్యున్నతికి దివంగత నేత, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు చేసిన సేవలు చిరస్మరణీయమని జయశంకర్ భూపాలపల్లి సంయుక్త కలెక్టర్ కూరాకుల స్వర్ణలత తెలిపారు. ఆయన శత జయంతిని పురస్కరించుకొని కలెక్టర్ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. బహుబాషా కోవిదులు, రాజకీయ అపర చాణిక్యుడైన పీవీ నరసింహారావు సర్పంచ్‌గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి.. దేశ ప్రధానమంత్రి స్థాయికి ఎదిగారని కొనియాడారు. ఆయన మన తెలుగు వారు కావడం తెలుగు వారందరికీ గర్వకారణమని పేర్కొన్నారు.
దేశం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తరుణంలో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి దేశ ఆర్థిక అభివృద్ధికి బాటలు వేశారని ప్రశంసించారు. దేశానికి ఆయన చేసిన సేవలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఆయన శత జయంతి ఉత్సవాలను సంవత్సరం పొడవునా నిర్వహించడం శుభదాయకమని తెలిపారు.