ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనుగోలు కేంద్రాల్లో తడిసి మొలకెత్తుతోంది. అమ్మకానికి సిద్ధంగా ఉన్న ధాన్యం వర్షాలతో నీటి పాలవుతోంది. కొనుగోలు కేంద్రాలలో తగినన్ని కవర్లు లేకపోవడంతో రైతులు ధాన్యాన్ని తడవకుండా కాపాడలేకపోతున్నారు. రైతుల వద్ద ఉన్నవి తెచ్చి కప్పిన కూడా ఫలితం లేకపోతోందని అంటున్నారు.
ప్రధానంగా కొనుగోలు కేంద్రాలలో జాప్యం జరుగుతుండటంతో ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వానకాలం పంట వేసుకునే సమయం వచ్చినప్పటికీ... వేసవికాలంలో పండించిన ధాన్యాన్ని ఇంకా అమ్ముకోలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరుకు పోయిన ధాన్యాన్ని తరుగు లేకుండా కొనుగోలు చేసి రైతులకు న్యాయంగా డబ్బులు అకౌంట్‌లో జమ చేయాలని వేడుకుంటున్నారు.
పంట పండించడం ఒకెత్తయితే ధాన్యం అమ్ముకోవడం మరొకెత్తవుతోందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. ధాన్యాన్ని కేంద్రాల వద్ద పోసి 30 రోజులు అవుతున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం వల్ల అమ్ముకోలేక పోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంటలు అయిన ధాన్యాన్ని కూడా లారీలో ఎక్కించడం లేదని... అధికారులు, నిర్వాహకులు కుమ్మక్కై రైతులను ఆగం చేస్తున్నారని కంటతడి పెడుతున్నారు.
ఇప్పటివరకు కేవలం...
అధికారుల నిర్లక్ష్యంతో... జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు కేవలం 1,17,842 టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు జరిగిందని తెలిపారు. వీటిలో ఐకేపీ గ్రూప్ ద్వారా 7,597 టన్నులు, జీసీసీలతో 2,943 టన్నులు, పీఏసీఎస్ ద్వారా 1,05,123 టన్నులు ప్రభుత్వం కొనుగోలు చేసింది.
సర్కార్ చెబుతున్నప్పటికీ ...
ప్రభుత్వం కొనుగోలు చేయమని చెబుతున్నప్పటికీ... అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం తడిసి మొలకెత్తుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో శ్రమించి పండించిన పంట చేతికందే సమయానికి నీటిపాలు అవుతుండటంతో... కనీసం పెట్టుబడులు రాని పరిస్థితి నెలకొందని విలపిస్తున్నారు.
40 కేజీల బస్తాకు 4 కేజీల కోత...
ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు రెండు నుంచి మూడు కిలోల కోత విధిస్తూ ఉండగా... మరోవైపు సుమారు 40 కేజీల బస్తాకు 4 కేజీల కోత విధించే ఒప్పందానికి వస్తే తప్పా... తాము అన్‌లోడ్ చేయలేమని మిల్లర్లు తేల్చి చెబుతున్నారని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఎలాంటి కోత లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: L.Ramana: 'పార్టీలో చేరాలని తెరాస, భాజపా నన్ను సంప్రదించాయి'