మేడారం జాతర ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఉన్నతాధికారులతో సమీక్షించారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకు జరిగే సమ్మక్క, సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జాతరకు కోటికిపైగా భక్తులు వస్తారని, ప్రతి శాఖ.. తమకు కేటాయించిన నిధులను సద్వినియోగం చేసుకొని భక్తులకు సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
మాస్టర్ ప్లాన్
వచ్చే 10 సంవత్సరాలను దృష్టిలో ఉంచుకొని మాస్టర్ ప్లాన్ రూపొందించి సౌకర్యాలను మెరుగుపరచాలన్నారు. జాతరలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడంతోపాటు పర్యావరణహితంగా అడవులకు ఎటువంటి నష్టం కలగకుండా చూడాలన్నారు. జాతర ఏర్పాట్ల కోసం భూసేకరణకు సంబంధించి భూములు ఇచ్చేవారికి స్వయం ఉపాధి కల్పించి.. ఎంటర్ప్రెన్యుర్షిప్ అభివృద్ధి చేసేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎస్ వివరించారు.
లోటుపాట్లు
గత జాతర నిర్వహణలో ఏర్పడిన లోటుపాట్లను దృష్టిలో ఉంచుకొని పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలన్నారు. పారిశుద్ధ్యం, పార్కింగ్, బందోబస్తు, బస్సు సర్వీసుల ఏర్పాటు, మంచినీరు, విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ నిర్వహణ, అగ్నిమాపక నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. వివిధ శాఖలు తమకు కేటాయించిన పనులను డిసెంబర్ చివరినాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. పోలీసు శాఖ ద్వారా సీసీ టీవీల ఏర్పాటుతోపాటు ట్రాఫిక్ నిర్వహణను వివిధ శాఖలు సమన్వయంతో చేపట్టాలన్నారు.
ఇదీ చూడండి: తెలంగాణ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్..!