Girls Safety Awareness : కాస్త పరిచయాన్ని ఆసరాగా చేసుకుని బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతూ, నయవంచనకు దిగుతున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. కొందరు అమాయకులను టార్గెట్గా చేసుకుని బెదిరింపులకు పాల్పడి లొంగదీసుకుంటున్నారు. ఉన్నత పాఠశాల, జూనియర్ కాలేజీ స్థాయి విద్యార్థినులే ఎక్కువగా బాధితులవుతున్నారు. ఉజ్వల భవిష్యత్తును చూడాల్సిన వారు బాహ్య ప్రపంచంలోకి రాలేక ఇంటికే పరిమితమవుతున్నారు. కొన్ని ఉదంతాలు ఠాణాల వరకు వెళ్లి కేసులు నమోదవుతుండగా మరికొన్ని వెలుగులోకి రావడం లేదు. తల్లిదండ్రులు చెడు, మంచి స్పర్శల మధ్య తేడాను వివరించి అప్రమత్తంగా ఉండేలా, అమ్మాయిలకు అవగాహన కల్పించాలని నిపుణులు సూచిస్తున్నారు.
స్త్రీని దేవతగా పూజించే మనదేశంలో అబలకు రక్షణ అనేదే లేకుండా పోతోంది. కామాంధుల చెరకు పసికందా, పిల్లా, తల్లా అన్నా తేడాలేకుండా పోయి కీచకపర్వానికి తెరలేపుతున్నారు. బాంధవ్యాలకు బందీలు విధిస్తూ మన అనుకున్న వాళ్లే అమానవీయంగా ప్రవర్తిస్తూ, చిన్నారులను సైతం వికృత చేష్టలతో చిదిమేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగుచూస్తున్నాయి. దిశ వంటి కఠిన చట్టాలు ఉన్నప్పటికీ కన్నూమిన్నూ కానరాక కొందరు కసాయిగా మారి కాటేస్తున్నారు. మరికొందరు పరిచయాన్ని ఆసరాగా తీసుకుని ప్రేమ పేరిట మాయమాటలు చెబుతున్నారు. నమ్మించి ఏకాంత ప్రదేశాలకు తీసుకెళ్లి దారుణాలకు ఒడిగడుతున్నారు. వీరిలో ప్రధానంగా తెలిసినోళ్లతోనే ముప్పు వాటిల్లినట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తల్లిదండ్రులు ఇలా చేస్తే మేలు
- అమ్మాయిలకు మంచి, చెడు స్పర్శ వంటి విషయాలపై సరైన అవగాహన కల్పించడానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
- రోజూ పిల్లలతో (ముఖ్యంగా బాలికలు) కొంత సమయం మాట్లాడి వారి దినచర్య, ఎవరెవరితో మాట్లాడుతున్నారనే అంశాలు తెలుసుకుని అప్రమత్తం చేయాలి.
- ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించి, అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే వారి గురించి ఇంట్లో చెప్పాలని సూచించాలి. చేదు అనుభవం ఎదురైతే నెమ్మదిగా సమస్య తెలుసుకుని పరిష్కరించేందుకు చొరవచూపాలి.
టీచర్లదీ కీలక పాత్ర
- లైంగిక దాడులకు గురవుతున్న వారిలో రూరల్ ఏరియాలకు చెందిన బాలికలే ఎక్కువగా ఉంటున్నారు.
- టీచర్లు చొరవ తీసుకుని సమాజంలో చోటుచేసుకుంటున్న దారుణ ఉదంతాలను వారికి అర్థమయ్యేలా వివరించే ప్రయత్నం చేయాలి.
- ఇతరులు ఎక్కడ తాకితే ఎలా స్పందించాలో తెలియజేసి అమ్మాయిలను చైతన్యపరచాలి. అతిక్రమిస్తే తక్షణం వ్యతిరేకించే పద్ధతులను నేర్పి, ఝాన్సీరాణిలాలా తీర్చిదిద్దాలి.
వలపు వల - ఉచ్చులో చిక్కి విలవిల - ప్రేమ పేరిట బాలికలపై పంజా - Men Cheating Girls in Name of Love