Hussain Sagar Water Pollution : హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లో గణేశ్ విగ్రహాల నిమజ్జనం ముగిసి సుమారు 15 రోజులు దాటిపోయింది. అప్పుడు నిమజ్జన సమయంలో అక్కడ విపరీతమైన జల కాలుష్యం నమోదైనట్లు కాలుష్య నియంత్రణ మండలి(PCB) వెల్లడించింది. అయితే హుస్సేన్ సాగర్ పరివాహకంలోని కొన్ని ప్రాంతాల్లో అధిక మోతాదులో కాలుష్యం నమోదైతే, మరికొన్నింటిలో తక్కువ మోతాదులో కాలుష్యం ఉందని తెలిపింది. లేపాక్షి హ్యాండిక్రాఫ్ట్స్ వైపు ఐదు చోట్ల క్రోమియం అధిక మోతాదులో ఉన్నట్లు నిర్ధారణ అయింది.
విగ్రహాల నిమజ్జనానికి ముందు, ఆ తర్వాత జలాశయం చుట్టుపక్కల ఆరు ప్రాంతాల్లో పీసీబీ నీటి నాణ్యతను పరీక్షించింది. ఈ పరీక్షల ఫలితాలను తాజాగా పీసీబీ వెల్లడించింది. వీటిలో ఎన్టీఆర్ పార్కు వద్ద రెండు చోట్ల, లుంబినీ పార్కు సమీపంలోనూ, నెక్లెస్ రోడ్, బుద్ధ విగ్రహం, లేపాక్షి హ్యాండిక్రాఫ్ట్స్ వద్ద పీసీబీ అనేక శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌కు పంపారు. ఇక్కడి నీటిలోని టీడీఎస్(టోటల్ డిజాల్వుడ్ సాలిడ్స్), టీఎస్ఎస్(టోటల్ సస్పెండెడ్ సాలిడ్స్), సీవోడీ(కెమికల్ ఆక్సిజన్ డిమాండ్), డీవో(డిజాల్వుడ్ ఆక్సిజన్), బీవోడీ(బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్), ఫీకల్ కొలిఫామ్, టోటల్ కొలిఫామ్ స్థాయిలు ఎలా ఉన్నాయో పరీక్షించి ఫలితాలు వెల్లడించింది.
హుస్సేన్ సాగర్ నీటిని పరీక్షించిన తర్వాత రిపోర్టు :
- హుస్సేన్ సాగర్‌లో విగ్రహాల నిమజ్జనం వేళ అన్ని చోట్ల టీఎస్ఎస్ అంటే నీటి అడుగున చేరే మలినాలు, టర్బిడిటీ ఎక్కువ మోతాదులో ఉందని తెలిపింది. ఆ తర్వాత తగ్గినా, నిమజ్జనం ముందున్న స్థాయికి మాత్రం చేరుకోలేదంది.
- ఎన్టీఆర్ పార్కు, బుద్ధ విగ్రహం, లుంబినీ పార్కు వద్ద అత్యధిక మోతాదులో టోటల్ డిజాల్వుడ్ సాలిడ్స్(టీడీఎస్) నమోదు అయింది. దీంతో చర్మంపై దద్దుర్ల సమస్యలు ఉత్పన్నం అవుతాయి.
- జలచరాల మనుగడకు అవసరమైన డిజాల్వుడ్ ఆక్సిజన్ లీటరు నీటిలో 4 ఎంజీల కంటే తక్కువ ఉండకూడదు. అయితే హుస్సేన్ సాగర్‌లో చాలా చోట్ల 2.5 నుంచి 4 మధ్య విలువలు నమోదు అయ్యాయి.
- గతేడాదితో పోలిస్తే ఎన్టీఆర్ పార్కు ప్రాంతం మినహా ఇతర ప్రాంతాల్లో టీడీఎస్ స్థాయిలు ఒకేలా ఉన్నాయని తెలిపింది. ఎన్టీఆర్ పార్కు, నెక్లెస్ రోడ్, లుంబినీ పార్కు ప్రాంతాల్లో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ తక్కువగా నమోదు అయినట్లు పేర్కొంది.
- కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ స్థాయిలు పెరిగిపోయాయి. బీవోడీ పెరిగితే కాలుష్యం పెరిగినట్లేనని నిపుణులు తెలుపుతున్నారు. లీటరు నీటిలో 3 ఎంజీల కంటే ఎక్కువ నమోదు కాకుండా ఉండాలి. హుస్సేన్ సాగర్‌లోని అన్ని ప్రాంతాల్లో అంతకు మించి నమోదు అయింది.
హుస్సేన్‌సాగర్‌లో ప్రారంభమైన పారిశుద్ధ్య పనుల ప్రక్రియ - Ganesha immersions in Tankbund