Attractive Tourism Places in Ananthagiri : ఆ మార్గంలో వెళ్లినప్పుడల్లా అందమైన ప్రకృతి మనల్ని పలకరిస్తుంది. అక్కడ ఉన్న ఎత్తయిన గుట్టలు, పరుగులు తీసే జింకలు, పక్షుల కిలకిలరావాలు, మయూరాల విన్యాసాలు, అనంత పద్మనాభస్వామి ఆలయం ఇవన్నీ అనంతగిరి సొంతం. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు కేవలం 60 కి.మీ. దూరంలో ఉన్న అనంతగిరికి వెళితే సహజసిద్ధ ప్రకృతిని ఆస్వాదించవచ్చు. అంతేకాకుండా ఇక్కడి కోటపల్లి ప్రాజెక్టులో బోటు షికారు కూడా చెయొచ్చు. ఇక్కడికొస్తే రోజంతా ఆహ్లాదంగా గడిపేలా ఎన్నో అవకాశాలున్నాయి. మరెందుకు ఆలస్యం ఎంచక్కా దసరా సెలవుల్లో అనంతగిరికి వచ్చి ఇక్కడి అందాలను ఆస్వాదించి వద్దాం పదండి.
Lose yourself in the enchanting beauty of Ananthagiri Hills this monsoon! pic.twitter.com/2d2cMTFOJx
— Ananthagiri_Hills_Vikarabad (@visitanathagiri) August 14, 2024
వికారాబాద్‌ను ఆనుకొని వేలాది ఎకరాల్లో విస్తరించిన అనంతగిరి అటవీ ప్రాంతంలో అప్పటి నిజాం ఏడో నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఔషధ మొక్కలను గుర్తించారు. దీంతో ఛాతీ వైద్య ఆసుపత్రి (క్షయ చికిత్సాలయం) నిర్మించారు. ఇక్కడ స్థానిక పట్టణాలు, గ్రామాలతో పాటు కర్ణాటకలోని, గుల్బర్గాకు చెందిన క్షయ పీడితులు సైతం వచ్చి చికిత్స పొందుతున్నారు. ఎన్నో రకాల వన్యప్రాణులకు, పక్షులకు ఈ ప్రాంతం నెలవైందని తేలింది. ఔషధ మొక్కలు డెహ్రడూన్ నుంచి తీసుకొచ్చి అనంతగిరిలో నాటి ఔషధ ఝరిగా రూపొందించడానికి కృషి జరుగుతోంది.
'ఈ ప్రాంతంలో ఇప్పటికే ఎన్నో రకాల ఔషధ మొక్కలున్నాయి. మరిన్ని నాటి సంరక్షించేందుకు ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. అడవి అభివృద్ధికి సైతం అన్ని రకాలుగా కృషి జరుగుతోంది. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు వసతుల కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం'- జ్ఞానేశ్వర్, డీఎఫ్‌వో
ఔషధ మొక్కల సంరక్షణ : అటవీ ప్రాంతంలోనే, ఖాళీ ప్రదేశాలు, మైదానాల్లో ఔషధ మొక్కలు నాటారు. వాటికి నష్టం వాటిల్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం అయితే అనువైన ప్రదేశాల్లో జిల్లేడు, ఉసిరి, నక్కెర, మర్రి, దంతి, మేడి, గుంపెన, మామిడి, ఇప్ప, నల్లజీడి, చింత, చిల్ల, తాని, పాలకొడిశ, కరక తదితర ఔషధాలకు చెందిన వాటిని నాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు.
బుగ్గ రామలింగేశ్వరాలయం : అనంతగిరికి వచ్చే పర్యాటకులు బుగ్గ రామలింగేశ్వర ఆలయాన్ని దర్శించుకుంటుంటారు. త్రేతాయుగంలో రాముడు రావణ సంహారం జరిగిన తర్వాత ఈ ప్రాంతంలో శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడ శివలింగానికి అభిషేకం చేయడం కోసం రాముడు బాణం వేసి పాతాళగంగను పైకి రప్పించాడని ప్రతీతి. గంగ బుడగ రూపంలో రావడంతో బుగ్గరామలింగేశ్వరుడు అని పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది. ఆలయంలోని నంది నోట్లో నుంచి నిరంతరం నీటి ధార వస్తూనే ఉంటోంది.
కోట్‌పల్లి ప్రాజెక్టు చూడాల్సిందే : అనంతగిరిలోని కోట్‌పల్లి ప్రాజెక్టు కూడా చూసి తీరాల్సిందే. వికారాబాద్‌కు దాదాపు 24 కి.మీ. దూరంలో ధారూర్ అటవీ ప్రాంతంలో ఈ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు అందాలు ప్రకృతి ప్రేమికులను ఇట్టే ఆకట్టుకుంటుంది. బోట్లో ఎంచక్కా షికారు చేసే అవకాశం కూడా ఉండటంతో అత్యధికులు ఇక్కడికి వస్తుంటారు. చుట్టూ దట్టమైన చెట్లతో కూడిన ప్రకృతి రమణీయ దృశ్యాలను చూసి తీరాల్సిందే. శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో అయితే సందడిగా ఉంటుంది.
అనంతగిరి విశేషాలు |
విస్తరించిన ప్రాంతం 3750 ఎకరాలు |
వన్య ప్రాణులు 16 |
పక్షులు 75 |
ఔషధ వృక్షాలు 307 |