కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ఉదయం కరీంనగర్ నుంచి హెలికాప్టర్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం చేరుకున్నారు. తొలుత గోదావరి ఘాట్‌కు వెళ్లి గోదావరికి ప్రత్యేక పూజలు చేశారు. కనుచూపు మేర జలనిధిగా మారిన ప్రాణహిత, గోదారి పవిత్ర జలాలను తల మీద చల్లుకొని పుష్పాభిషేకం చేశారు. నీటిలో నాణేలు వదిలి చీర, సారె సమర్పించారు.
అక్కడి నుంచి ఆలయంలోకి వెళ్లిన సీఎం కేసీఆర్‌కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్న సీఎం.. అభిషేకం నిర్వహించి, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు సీఎంను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం లక్ష్మి బ్యారేజ్‌ను విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. బ్యారేజ్ మీద నుంచి నాణాలు వదిలి మొక్కులు చెల్లించుకున్నారు. నీటి నిర్వహణపై అధికారులు, ఇంజినీర్లతో సమీక్షించారు.
ఎప్పటికప్పుడు నీటిని తోడుకోవాలి
రాబోయే వర్షాకాలం వరద నీరు ఉద్ధృతంగా చేరుతుందని, లక్ష్మి బ్యారేజ్ నుంచి ఎప్పటికప్పుడు నీటిని తోడుకోవాలని, అందుకు సంబంధించిన వ్యవస్థను సిద్ధం చేసుకోవాలని ఈఎన్సీలు మురళీధర్ రావు, నల్ల వెంకటేశ్వర్లు, వోఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండేలకు సూచించారు.
ఎంతో కష్టపడి కట్టుకున్న ప్రాజెక్టులలోని నీటిని ఎప్పటికప్పుడు తోడి పోసుకుంటూ రిజర్వాయర్లను నింపుతూ... గోదావరి జలాలు వృథా పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇంజినీర్లదే అన్నారు.
ఇంజినీరింగ్ విభాగాలన్నీ ఒకే గొడుగు కిందికి
సాయంత్రం కరీంనగర్ కలెక్టరేట్లో సాగునీటి పారుదల అధికారులతో సమావేశమయ్యారు. గోదావరి జలాలనున 100 శాతం సద్వినియోగం చేసుకోనేలా బ్యారేజ్‌ల ఆపరేషన్ రూల్స్ కార్యచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సాగునీటి లక్ష్య సాధనకు ఇంజినీరింగ్ విభాగాలను పునః వ్యవస్థీకరించాలని భేటీలో నిర్ణయించారు. సాగునీటికి సంబంధించిన ఇంజినీరింగ్ విభాగాలన్నీ ఒకే గొడుగు కిందికి తేవాలన్నారు 530 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తి పోసేలా అధికారులు అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
11 సర్కిళ్లుగా విభాజన
సాగు నీటి ఇంజినీరింగ్ వ్యవస్థను 11 సర్కిళ్లుగా విభజించాలన్నారు. సర్కిల్ అధిపతిగా చీఫ్ ఇంజనీర్ ఉండాలని ఆదేశించారు. జూన్ నెలాఖరులోగా ఇరిగేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఉన్న ఖాళీలు భర్తీ చేయాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని చెరువులను నింపేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. కరీంనగర్‌తో పాటు నిజామాబాద్ జిల్లా కేంద్రాల్లో ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్ల స్థానంలో కొత్త కలెక్టరేట్ల నిర్మాణం చేపట్టాలని కేసీఆర్ ఆదేశించారు. సమీక్ష అనంతరం రోడ్డు మార్గాన హైదరాబాద్ బయలుదేరారు.
ఇదీ చూడండి : కేంద్రంపై పోరుకు కాంగ్రెస్ సమాయత్తం!