జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రంగయ్యపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో అధికారులు రైతులను మోసం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కంప్యూటర్ కాంటాకు బదులు తరాజు బాట్లతో కాంటా వేస్తున్నారని, ఇష్టం వచ్చినట్లు ధాన్యం కాంటా వేస్తున్నారని విమర్శలున్నాయి. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, హమాలీలు కుమ్మక్కై తమను మోసం చేస్తున్నారని కర్షకులు వాపోతున్నారు.
క్వింటాల్ ధాన్యానికి 5 నుంచి 10 కిలోల ధాన్యం కోత విధిస్తున్నారని, హమాలీలు బస్తాకు 5 రూపాయలు అదనంగా తీసుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కాంటా వేసినందుకు తమ వద్ద డబ్బు దండుకుంటున్నారని కర్షకులు తెలిపారు. అధికారులు స్పందించి ఈ మోసాన్ని ఆపాలని కోరుతున్నారు.
కళ్లాల్లో ధాన్యం పోసి నెలలు గడుస్తున్నా.. ఇప్పటివరకు బార్దాన్ ఇవ్వలేదని రైతులు వాపోయారు. వానాకాలం సమీపిస్తుండటం వల్ల ధాన్యం తడిసిపోతుందేమోని భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.