మే 3 వరకు పొడిగించిన లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్ను దేశంలో పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని రాజీవ్ తెలిపారు.
అధికారులు పూర్తి మద్దతు తెలిపి క్షేత్రస్థాయిలో ప్రజలు ఇళ్లలోనే ఉండేలా చూడాలన్నారు. క్వారంటైన్లో ఉన్న వ్యక్తులకు అవసరమైన వైద్య సాయం అదించాలని... అంతేకాకుండా ఆసుపత్రుల్లో ఉన్న గర్భిణీలు, చిన్నారులు, వృద్ధులు, ఇతర అత్యవసర వ్యాధిగ్రస్తులకు సాధారణ వైద్య సేవలు అందేలా చూడాలన్నారు.
గ్రామాల్లో నిత్యావసర సరుకుల కొరత రాకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీమ్, జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్, జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాసులు, జిల్లా అదనపు కలెక్టర్ రాజా విక్రమ్ రెడ్డి, భూపాలపల్లి, ములుగు జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.