జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని సింగంపల్లిలో బాలుడి అపహరణ కలకలం రేపింది. కలగూరి మహేశ్, పద్మ దంపతులకు పది నెలల కుమారుడున్నాడు. ఆదివారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఇంటి ముందు చిన్నారి హరీశ్‌ను నానామ్మ ఆడిస్తోంది.
అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై మహేశ్ ఇంటికి చేరుకున్నారు. తాము ప్రభుత్వ ప్రతినిధులమని... రెండు పడక గదుల ఇల్లు మంజూరు చేయిస్తామని నమ్మబలికారు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పూర్తి వివరాలు ఇవ్వాలని అడిగారు. వాకిట్లో ఉన్న మంచంలో చిన్నారిని పడుకోబెట్టి ఇంట్లోకి వెళ్లింది. మళ్లీ బయటకు వచ్చి చూసేసరికి... ఇద్దరు వ్యక్తులతో పాటు బాలుడు కూడా లేడు.
కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ముమ్మర విచారణ చేపట్టారు. బాలుడు హరీశ్‌ని బైకుపై ఎత్తుకెళ్తున్న దృశ్యాలు బోర్లగూడెంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. చుట్టుపక్కల ప్రాంతాల పోలీస్స్టేషన్లకు కూడా సమాచారమిచ్చి దర్యాప్తు ముమ్మరం చేశారు.