Thatikonda Rajaiah comments: స్టేషన్ ఘన్‌పూర్‌లో అధికార పార్టీ వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. ఒకే సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు.. అందులోనూ ఉపముఖ్యమంత్రులుగా చేసిన నేతలు.. ఒకరిపై ఒకరు బహిరంగంగా విమర్శలు చేసుకోవటం చర్చనీయాంశంగా మారింది. స్టేషన్ ఘన్‌పూర్ తన అడ్డా అని.. ఎవరినీ రానివ్వనంటూ రాజయ్య చేసిన వ్యాఖ్యలు నియోజకవర్గంలో అంతర్గతంగా ఉన్న విభేదాలపై కారం చల్లినట్టైంది. వాటితో పాటు ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై విమర్శలు చేయటంతో ఘన్‌పూర్ ఎపిసోడ్ తెరపైకి వచ్చి ఆసక్తికరంగా మారింది. రాజయ్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కడియం శ్రీహరి.. రాజయ్యపై విరుచుకుపడ్డారు. నియోజకవర్గంలో తేల్చుకుందామంటూ సవాల్ విసిరారు. తన దగ్గరున్న ఆధారాలు బయటపెడితే బయట తిరగలేవంటూ హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే.. కడియం చేసిన వ్యాఖ్యపై రాజయ్య కూడా గట్టిగానే స్పందించారు.
స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం పక్కా తన అడ్డానే అని రాజయ్య ఉద్ఘాటించారు. కడియం శ్రీహరి తన మీద చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. 14 ఏళ్లుగా మంత్రిగా పని చేసిన కడియం శ్రీహరి స్టేషన్ ఘన్‌పూర్‌కు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. అవినీతి మార్గంలో ఆస్తులు కూడాబెట్టుకున్నది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. సీఎం కేసీఆర్ చెప్పిన మాటకు తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. తాన దగ్గరున్న ఆధారాలు బయటపెడితే.. గ్రామం కాదు కదా కనీసం ఇంటి నుంచి బయటకు కూడా రాలేవని రాజయ్య హెచ్చరించారు. తన వద్ద లోపాలు పెట్టుకుని కడియం శ్రీహరి నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్‌కు విధేయుడుగా ఆయన మాట ప్రకారం మంత్రి పదవి నుంచి తప్పుకున్నానని తెలిపారు. తెరాస చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో.. తెదేపా, కాంగ్రెస్ హయాంలో వెనకబడిన సంక్షేమ పరిస్థితులను పోల్చుతూ మాట్లాడానే గానీ.. వ్యక్తిగతంగా విమర్శించలేదని వ్యాఖ్యానించారు. ఎక్కడా పార్టీ లైన్ దాటకుండా పని చేస్తున్నానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ తనకే అంటూ తప్పుడు ప్రచారంతో విభేదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు
"నా పని నేను చేసుకుంటా.. ఎవరి గురించీ పట్టించుకోను. నాపై లేనిపోని నిందలు వేస్తున్నారు. స్టేషన్ ఘన్‌పూర్ ప్రజల మనసుల్లో నేనే నెంబర్‌వన్. అవినీతి పనులతో పైసలు సంపాదించింది ఎవరో అందరికీ తెలుసు. పిల్లల వైద్యుడిగా జాతీయ స్థాయిలో నాకు పేరుంది. నా నియోజకవర్గానికి నీళ్లు వస్తే ఎదురెళ్లి ఆహ్వానిస్తా. కష్టపడి పనిచేసే తత్వం నాది.. వివాదాల జోలికి పోను." - తాటికొండ రాజయ్య, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే
ఇదీ చూడండి: