BANDI SANJAY PADAYATRA: జనగామ జిల్లాలో బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజాసంగ్రామ యాత్రలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాదయాత్రలో భాగంగా కునూరు మీదుగా వెళ్తున్న క్రమంలో తెరాస శ్రేణులు బండి సంజయ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.. అది గమనించిన భాజపా కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీఛార్జ్ చేశారు. దీంతో కొద్దిసేపటి తర్వాత పరిస్థితి సద్దుమణిగింది.
కార్యకర్తలకు గాయాలు: పోలీసుల లాఠీఛార్జ్‌లో కూనూరుకు చెందిన భాజపా కార్యకర్త నగేష్‌కు, జాఫర్ఘడ్ మండల భాజపా కార్యదర్శితో పాటు మరొకరి గాయాలయ్యాయి. వీరిని కూనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కక్షపూరితంగా పోలీసులు తమపై దాడి చేశారని వారు ఆరోపించారు. బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకునే కుట్రలో భాగంగానే ఈ దాడులు కొనసాగుతున్నాయని భాజపా శ్రేణులు పేర్కొన్నారు.
మూడో విడత ప్రజాసంగ్రామ యాత్రను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తిరిగి ప్రారంభించారు. మొన్న ఆపేసిన ఉప్పుగల్ సమీపంలోని శిబిరం నుంచే యాత్రను మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై బండి సంజయ్ నిప్పులు చెరిగారు. హనుమకొండ ఆర్ట్స్ కళాశాలలో సభ నిర్వహించి తీరతామని ఉద్ఘాటించారు. దమ్ముంటే సభను అడ్డుకోవాలని.. తమ సత్తా ఎంటో చూపిస్తామని సవాల్ విసిరారు. యాత్రలో భాగంగా.. మొన్న ఆపేసిన ఉప్పుగల్ సమీపంలోని శిబిరం నుంచే యాత్రను తిరిగి ప్రారంభించారు. ఉప్పుగల్, కూనూరు, గర్మేపల్లి మీదుగా నాగాపురం వరకు పాదయాత్ర సాగనుంది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం బండి సంజయ్ నిప్పులు చెరిగారు. అనుమతి ఇచ్చిన ప్రభుత్వమే.. ఇప్పుడు అనుమతులు లేవంటోందని మండిపడ్డారు. కోర్టులపై తమకు విశ్వాసం ఉందని బండి సంజయ్ తెలిపారు. హైకోర్టు అనుమతి ఇచ్చింది కాబట్టే పాదయాత్ర మళ్లీ ప్రారంభించామన్నారు. కేసులు పెట్టినా, లాఠీఛార్జ్ చేసినా భరిస్తామన్న బండి సంజయ్.. యుద్ధంలో చివరికి ధర్మమే గెలుస్తుందన్నారు. సీఎం కుటుంబంపై ఉన్న ఆరోపణలు పక్కదోవ పట్టించేందుకే తమపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
హైకోర్టులో సర్కార్ పిటిషన్: మరోవైపు బండి సంజయ్ పాదయాత్ర ఆపాలని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి హైకోర్టును ఆశ్రయించింది. పాదయాత్ర ఆపాలని పోలీసులిచ్చిన నోటీసును హైకోర్టు సింగిల్ జడ్జి నిన్న సస్పెండ్ చేశారు. ప్రజాసంగ్రామ యాత్రకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అయితే.. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వం లంచ్ మోషన్ దాఖలు చేసింది. అప్పీల్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని సీజే ధర్మాసనాన్ని కోరింది. పాదయాత్ర సాగితే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని ప్రభుత్వం తెలిపింది. మధ్యాహ్నం ఒంటిగంట 15 నిమిషాలకు విచారణకు సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం అంగీకరించింది.
ఆగస్టు 23న బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను నిలిపివేయాలని పోలీసులు నోటీసులు జారీచేశారు. జనగామ జిల్లాలో ప్రజాసంగ్రామ యాత్రకు అనుమతి లేదని నోటీసులో పేర్కొన్నారు. పాదయాత్ర పేరిట విద్వేషపూరిత ప్రకటనలు చేస్తున్నారని... ధర్మదీక్ష పేరుతో వివిధ జిల్లాల నుంచి భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారని పేర్కొన్నారు. రెచ్చగొట్టే ప్రకటనలతో, ఇతర జిల్లాల నుంచి కార్యకర్తలను రప్పిస్తుండటంతో జిల్లాలో శాంతిభద్రతల విఘాతం ఏర్పడే ప్రమాదం ఉందని తెలిపారు. దీంతో తక్షణమే ప్రజా సంగ్రామ యాత్రను నిలిపేయాలని నోటీసులో పేర్కొన్నారు. నోటీసును పరిగణలోకి తీసుకోకుండా తిరిగి ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభిస్తే శాంతిభద్రతల సమస్య కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: బండి సంజయ్ పాదయాత్ర ఆపాలని హైకోర్టులో ప్రభుత్వం అప్పీల్
దమ్ముంటే సభను అడ్డుకోండి, మా సత్తా ఎంటో చూపిస్తామన్న బండి సంజయ్