జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండికి చెందిన కవితకు ఇద్దరు కుమార్తెలు. పిల్లలు పుట్టిన కొన్నాళ్లకే భర్త చనిపోయాడు. అప్పటి నుంచి కూలీనాలీ చేసుకుంటూ.. కుటుంబాన్ని పోషిస్తోంది. కూతుళ్లను చదివిస్తోంది. పెద్దమ్మాయి మౌనిక హోటల్ మేనేజ్మెంట్, చిన్నకూతురు యామిని ఇంటర్ చదువుతున్నారు. పక్షవాతంతో మంచానికే పరిమితమైన అత్త, మామలను చూసుకుంటూ... కుటుంబాన్ని కంటికిరెప్పలా చూసుకునేది. అంతా బాగానే సాగుతోందన్న వారి కుటుంబాన్ని కరోనా మహమ్మారి కబళించింది.
కవితకు కరోనా సోకగా... ఈ నెల 5న మహమ్మారితో పోరాడుతూ తుదిశ్వాస విడిచింది. ఊహతెలియని వయసులోనే తండ్రి.. కరోనా కారణంగా తల్లి కూడా దూరమటంతో ఆ అమ్మాయిలకు పెద్ద దిక్కు లేకుండా పోయింది. మంచానికే పరిమితమైన నానమ్మ, తాతలకు సేవలు చేస్తూ.. దూరమైన అమ్మనాన్నలకు తలుచుకుంటూ ఆ అక్కాచెళ్లెల్లు బాధపడుతున్నారు. ఆదుకునే వారి కోసం ధీనంగా ఎదురు చూస్తున్నారు. ఇన్నిరోజులు తండ్రి లోటు తెలియకుండా పెంచిన తల్లి మరణంతో ఒక్కసారి దిక్కుతోచని స్థితిలో పడిపోయామంటూ... కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బంధువులు ఎంత ఓదార్చే ప్రయత్నం చేసినా... వారి గుండెల్లోని దుఃఖాన్ని.. మనసులోని బాధను తొలగించలేకపోతున్నారు.
తల్లితండ్రి లేని ఇద్దరు అమ్మాయిలను ప్రభుత్వమే ఆదుకోవాలని బంధువులు కోరుతున్నారు. దాతలెవరైనా సాయం చేసి వారి భవిష్యత్‌కు భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.