CM KCR Jangaon Visit: సీఎం కేసీఆర్ కృషి వల్లే దేశంలోనే తెలంగాణ నెంబర్‌వన్ రాష్ట్రంగా ఎదిగిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. రేపు(ఫిబ్రవరి 11న) సీఎం కేసిఆర్ జనగాం పర్యటన నేపథ్యంలో బహిరంగ సభ స్థలం ఏర్పాట్లను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పరిశీలించారు. రేపు ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్.. కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం జిల్లా ప్రజా ప్రతినిధులతో సమావేశమవుతారు. భోజనవిరామం అనంతరం జిల్లా ప్రజాప్రతినిధులతో అభివృద్ధిపై సమీక్షిస్తారు. ఆ తర్వాత తెరాస కార్యాలయాన్ని ప్రారంభించి.. జిల్లా ముఖ్యనాయకులతో సమావేశమవుతారు. అనంతరం 3 గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
సభకు రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ప్రజలు..
జనగామ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించనున్న నేపథ్యంలో.. కేసీఆర్ కృషికి కృతజ్ఞతగా జనగామలో బహిరంగ సభ నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్రం ఎలా అభివృద్ధి సాధించిందో తెలపటమే బహిరంగ సభ ముఖ్య ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. ఈ సభలో లక్షకు పైగా ప్రజలు హాజరవుతారని మంత్రి తెలిపారు. తెరాస అధికారంలోకి వచ్చాకే జనగాం జిల్లాగా ఏర్పడి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. తెలంగాణపై ప్రధాని మోదీ వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రజలు మండి పడుతున్నారన్నారు.
కేసీఆర్ వల్లే నీటి సమస్య పరిష్కారం..
"సీఎం కేసీఆర్ వల్లే జనగామ జిల్లాలో నీటి సమస్య తీరింది. దేవాదుల ద్వారా జిల్లాలో ప్రతి చెరువు నింపాం. కేసీఆర్ సీఎం అయిన తర్వాత జనగామ జిల్లా అభివృద్ధి చెందింది. కేంద్రం తన హామీలు అమలు చేయకపోయినా.. తెలంగాణ అభివృద్ధి చెందుతోంది. పార్లమెంటులో కేంద్రమంత్రులే తెలంగాణ అభివృద్ధి గురించి చెప్పారు. కేసీఆర్ వెనక నిలబడి తెలంగాణను కాపాడుకోవాలని ప్రజలు భావిస్తున్నారు. కేసీఆర్ కృషికి కృతజ్ఞతగా జనగామ జిల్లాలో బహిరంగ సభ నిర్వహిస్తాం. తెరాస బహిరంగ సభకు లక్షకు పైగా ప్రజలు హాజరవుతారు." - ఎర్రబెల్లి దయాకర్రావు, మంత్రి
అక్కస్సుతోనే ప్రధాని వ్యాఖ్యలు..
అభివృద్ధి ప్రధాత సీఎం కేసిఆర్ జనగాం పర్యటన సందర్భంగా ప్రజలు పెద్ద మొత్తంలో తరలి రావాలని మంత్రి సత్యవతి రాఠోడ్ కోరారు. సాగు, తాగునీటి ఇబ్బంది తీర్చి జనగాం అభివృద్ధికి కృషి చేసిన సీఎం సందేశం వినేందుకు ప్రజలు అధిక సంఖ్యలో తరలి వచ్చేందుకు సిద్దమయ్యారన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీసేలా మోదీ మాట్లాడారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసిన కేసీఆర్.. దేశ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తారనే అక్కస్సుతోనే ప్రధాని ఇలా మాట్లాడుతున్నారని మంత్రి ఆరోపించారు.
ఇదీ చూడండి: