Ponnala Lakshmaiah joined BRS : ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య బీఆర్‌ఎస్‌లో చేరారు. జనగామ జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాల మైదానంలో బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం సమక్షంలో పొన్నాల బీఆర్‌ఎస్ గూటికి చేరారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా 45 ఏళ్లు కాంగ్రెస్‌లో ఉండి అవమానాలకు గురయ్యానని పొన్నాల ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం అయిన 3 నెలలకే కేసీఆర్ కులగణన, సమగ్ర సర్వే చేపట్టారని ఆయన గుర్తు చేశారు. జనగామ నియోజకవర్గంలో కేసీఆర్ 7 రిజర్వాయర్లు నిర్మించారని.. జనగామ అత్యున్నత అభివృద్ధి కోసం బీఆర్‌ఎస్‌లో చేరానని తెలిపారు. ఈ క్రమంలోనే జనగామకు కేసీఆర్ మరింత ప్రోత్సాహం ఇవ్వాలని.. పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రోత్సాహం అందించాలని కోరుతున్నానని పొన్నాల స్పష్టం చేశారు.
45 ఏళ్లు కాంగ్రెస్‌లో ఉండి అవమానాలకు గురయ్యాను. జనగామ నియోజకవర్గంలో కేసీఆర్ 7 రిజర్వాయర్లు నిర్మించారు. జనగామ అత్యున్నత అభివృద్ధి కోసం బీఆర్‌ఎస్‌లో చేరాను. జనగామకు కేసీఆర్ మరింత ప్రోత్సాహం ఇవ్వాలి. జనగామలో పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రోత్సాహం ఇవ్వాలని కోరుతున్నా. - పొన్నాల లక్ష్మయ్య
కేసీఆర్‌తో భేటీ..: పొన్నాల లక్ష్మయ్య.. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఆదివారం మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ప్రగతిభవన్‌కు వెళ్లిన పొన్నాల దంపతులను కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. కాసేపు ఆయనతో మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే జనగామ సభకు హాజరు కావాలన్న సీఎం విజ్ఞప్తి మేరకు బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. కేసీఆర్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.
మరో 28 మందికి బీ ఫారాలు..: జనగామ ప్రజా ఆశీర్వాద సభకు బయలుదేరే ముందు సీఎం కేసీఆర్ మరికొంత మంది బీఆర్‌ఎస్ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేశారు. ప్రగతిభవన్‌లో నేడు 28 మందికి బీ ఫారాలు అందించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, జగిత్యాల, పెద్దపల్లి, మహబూబాబాద్ తదితర జిల్లాల అభ్యర్థులకు ప్రగతిభవన్‌లో బీ-ఫారాలు పంపిణీ చేశారు. నిన్న మధ్యాహ్నం 51 మందికి బీ-ఫారాలు అందించగా.. మరో 18 మందికి రాత్రి ఇచ్చారు. ఇవాళ మరో 28 మంది అభ్యర్థులకు బీ ఫారాలు ఇవ్వడంతో ఇప్పటి వరకు 97 మందికి ఇచ్చినట్లైంది. మిగతా అభ్యర్థులకు రేపు బీ-ఫారాలను పంపిణీ చేయనున్నారు. మల్కాజిగిరి నియోజకవర్గానికి సంబంధించి మర్రి రాజశేఖర్ రెడ్డి, గోషామహల్‌కు నందకుమార్ వ్యాస్ బిలాల్, నర్సాపూర్‌కు సునీతా లక్ష్మారెడ్డికి కూడా రేపు బీఫారాలు ఇవ్వనున్నారు.