జనగామ జిల్లా నెల్లుట్ల గ్రామానికి చెందిన రావుల యాదగిరి, యాదమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. యాదమ్మ అనారోగ్యంతో మరణించడంతో అంజమ్మను రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఇద్దరు కుమారులు, కుమార్తె జన్మించారు. ఎకరం పొలం అమ్మి కూతుర్లకు పెళ్లిళ్లు చేశాడు. కుమారుల మధ్య ఇల్లు, పొలం పంపకం విషయంలో గొడవలు నెలకొన్నాయి. కొడుకులు, కోడళ్ల దూషణలు భరించలేని యాదగిరి దంపతులు ఐదేళ్లుగా వేరే అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వారి పేరిట ఉన్న ఎకరంన్నర పొలంపై వచ్చే ఆదాయం, ఆసరా పింఛన్‌తో జీవనం సాగిస్తున్నారు. రహదారి విస్తరణ పనుల్లో వారు ఉంటున్న ఇంటిని కూల్చేశారు.

మరో ఇంటికి అద్దె చెల్లించలేని పరిస్థితిలో వారు కొడుకులను ఆశ్రయించారు. వారు వెళ్లగొట్టడంతో వృద్ధ దంపతులు నెల రోజులుగా చిన్నకొడుకు ఇంటి ఆవరణలోనే ఉంటున్నారు. బయట ఉన్న అరుగులపైనే వంటగిన్నెలు, దుస్తులను భద్రపర్చుకున్నారు. ఆరుబయట మంచం వేసుకొని చలికి వణుకుతూ నిద్రిస్తున్నారు.
ఈ కుమారుల వ్యవహారంపై గ్రామస్థులు ఆగ్రహంతో ఉన్నారు. అవసాన దశలో ఇబ్బంది పెట్టడం సరికాదంటున్నారు. విషయం తెలుసుకున్న గ్రామపెద్దలు... కొన్ని రోజుల పాటు పోషించాలని పెద్ద కుమారుడు పరమేశ్‌కు తల్లిదండ్రులను అప్పగించారు.