జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కొన్నెగ్రామం పరిధిలో ఆదిమానవుని కాలంనాటి ఆనవాళ్లు లభ్యమైనట్లు సిద్దిపేట జిల్లాకు చెందిన ‘కొత్త తెలంగాణ చరిత్ర బృంద’ సభ్యులు అహోబిలం కరుణాకర్, సామలేటి మహేశ్ ఆదివారం తెలిపారు. కొన్నెగ్రామ పరిధిలోని గజగిరిగుట్టలో ఆదిమానవుని కాలం రాతి గొడ్డళ్లు, మట్టి పూసలు, కుండ పెంకులు, రాతి పనిముట్లు లభించాయన్నారు. వీటిలో కొన్ని రాళ్లను ఇనుము వస్తువులతో వాయించినపుడు సంగీతంలా ధ్వని చేస్తున్నట్లు తెలిపారు. ఇలా శబ్దం వచ్చే రాళ్లను సంగీతపు రాళ్లుగా పిలుస్తుంటారని.. దక్షిణ కొరియాలో ఈ రాళ్లను ఒక క్రమంలో పేర్చి మ్యూజికల్ జైలోఫోన్‌గా ప్రదర్శనకు ఉంచుతారని చెప్పారు.
వీటితో పాటు ఈ ప్రాంతంలో శాతవాహనుల నాటి అందమైన ఆకృతులతో కూడిన కుండ పెంకులు, టెర్రాకోట పూసలు, బొమ్మలు లభించాయన్నారు. గుట్ట అంచుల్లో రాతి గొడ్డళ్లను నూరుకునే గుంటలు ఇప్పటికీ కనిపిస్తాయని చెప్పారు. గజగిరిగుట్టకు సమీపంలో రాకాసి గుళ్లు అని పిలిచే రాతియుగం సమాధులున్నట్లు గుర్తించారు.