గతంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న పొన్నాల లక్ష్మయ్య కారణంగానే గోదావరి జలాలు రావడానికి ఆలస్యం అయిందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మండిపడ్డారు. జనగామ జిల్లా తరిగొప్పుల మండలం పోతారంలో జరిగిన నియంత్రిత పంటల సాగు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. పొన్నాల లక్ష్మయ్య తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఆంధ్ర నాయకులు ఇచ్చిన డబ్బుల సంచులు తీసుకుని తెలంగాణ ప్రాంతానికి ద్రోహం చేశారని, ఆంధ్రకు నీళ్లు తీసుకుపోయేందుకు మోటర్లను ఎక్కువ ఎత్తుల్లో నిర్మించి నీళ్లు అందకుండా చేశారని ఆరోపించారు.
ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో చర్చించి దేవాదుల వద్ద ఆనకట్ట నిర్మించడం వల్ల ఎండాకాలంలో కూడా గోదావరి జలాలు వస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి చేపట్టిన నియంత్రిత సాగుపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని, రైతులు నష్టపోకుండా లబ్ది పొందేందుకే ప్రణాళికలు తయారు చేశారని ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రభుత్వం సూచించిన పంటలు సాగు చేసి రైతులు లబ్దిపొందాలని సూచించారు.
ఇవీ చూడండి: వానాకాలం పంటల సాగు ప్రణాళికపై అవగాహన సదస్సు