కేరళలో ఇటీవల జరిగిన సౌత్ ఇండియా జూనియర్ అథ్లెటిక్స్ అండర్-16 విభాగంలో 2000 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పతకం సాధించిన కీర్తనను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అభినందించారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం గూడూరుకు చెందిన చెరిపెల్లి కీర్తనను మంత్రుల ప్రాంగణంలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి సత్కరించారు.
పాలకుర్తి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న కీర్తన.. అసమాన ప్రతిభను కనబరుస్తూ స్వర్ణ పతకం సాధించడం సంతోషకరమని మంత్రి దయాకర్రావు అన్నారు. గ్రామీణ నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన కీర్తన ప్రతిభకు గురుకుల పాఠశాల పదును పెట్టిందన్నారు.
ప్రభుత్వం స్థాపించిన గురుకుల పాఠశాలలు, కళాశాల్లో.. విద్యార్థులకు అత్యంత మెరుగైన ఆహారం, వసతి, చదువు, క్రీడా ప్రోత్సాహం లభిస్తోందని ఎర్రబెల్లి వివరించారు. కీర్తనకు మరింత ప్రోత్సాహం లభిస్తే, పీటీ ఉషలా దేశానికి కీర్తిని తెచ్చి పెట్టే కీర్తన అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పరంగా కీర్తనను మరింత ప్రోత్సహిస్తామన్నారు.