జనగామ జిల్లా లింగాల ఘన్పూర్, పాలకుర్తి మండలాల్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పర్యటించారు. ముందుగా లింగాల ఘన్పూర్ మండలం కుందారంలో ఉపాధి హామీ కూలీలతో మాట్లాడిన మంత్రి.. వారు చేస్తున్న పనులు, దొరుకుతున్న ఉపాధి, కరోనా పరిస్థితులు, భౌతిక దూరం వంటి పలు విషయాలను వారికి వివరించారు.
ఉపాధి పనులకు వేతనాలు పెరిగాయని.. ఏప్రిల్ నెల నుంచే పెరిగిన వేతనాలు వర్తిస్తాయని కూలీలకు వివరించారు. ఉపాధి పనులను వ్యవసాయ పనులకు అనుబంధం చేయాలని సీఎం కేసీఆర్, తాను కేంద్ర ప్రభుత్వానికి తెలిపినట్లు మంత్రి పేర్కొన్నారు. కష్టకాలంలో కరువు పనులు ఎంతో మేలు చేస్తాయని అన్నారు.
పనులు చేసే సమయంలో కూలీలు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని.. మాస్కులు ధరించాలని సూచించారు. ఉపాధి పనుల కింద ఉపయోగపడే పనులే చేయాలని మంత్రి తెలిపారు.
అనంతరం పాలకుర్తిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి సందర్శించారు. రైతులతో మాట్లాడి పలు వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజీవ్ చౌరస్తాలో కూరగాయాలు అమ్ముకునే మహిళలకు మాస్కులను పంపిణీ చేశారు.
ఇదీ చూడండి: పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి సారించండి : మోదీ