మద్యం, గుడుంబా, సారా...పేరేదైన... పచ్చని పల్లెల్లో కక్ష్యలూ.. కార్పణ్యాలు సృష్టిస్తోంది. కూలినాలీ చేసుకుని సంపాదించుకుంటున్న డబ్బు మద్యానికి తగలేసి ఒళ్లు, ఇల్లు గుల్ల చేసుకునేలా చేస్తోంది. అమాయక చిన్నారుల బాల్యం భారంగా గడిపేందుకు కారణమౌతోంది. హత్యలు... ఆత్మహత్యలు జరిగేలా ప్రేరేపిస్తోంది. ఇవన్నింటికీ కారణం మద్యమేనని తెలిసినా... ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోతున్నారు జనం. కానీ... జనగామ జిల్లా పెద్దపహాడ్ గ్రామస్థులు మాత్రం.... అలా బతకకూడదని నిర్ణయించుకున్నారు. మద్యంపై యుద్ధం ప్రకటించారు. తమకు తామే స్వచ్ఛంద మద్యనిషేధం విధించుకున్నారు.
మత్తుకు చెక్
పెద్దపహాడ్ గ్రామంలో రేయింబగళ్లు శ్రమించి వ్యవసాయం చేసి అధిక దిగుబడి తీసుకొస్తున్నారు. సాగులో మంచి పేరు తెచ్చుకుంటున్నా.... ఇక్కడ బెల్టు షాపుల కారణంగా మద్యం ఏరులై పారడం వల్ల అనేక కుటుంబాలు... ఆర్థికంగా చాలా ఇక్కట్లు పడ్డాయి. కొంతమందికి రోజు గడవడం కూడా కష్టంగా మారింది. తాగి చాలామంది అనారోగ్యం బారిన పడడం, అకాల మరణాలు సంభవించడం వల్ల... గ్రామస్థులు... మద్యం మహమ్మారికి చెక్ పెట్టాలని సమష్టిగా నిర్ణయించారు. దానిని పక్కాగా అమలు చేశారు.
మత్తు వదిలింది
మద్యం అమ్మకూడదని... తాగకూడదని... అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. మద్యం జోలికెళ్లి ఉల్లంఘించిన వారికి తాగునీరు, విద్యుత్, రేషన్, ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిపివేస్తామంటూ.... పంచాయతీలోనూ తీర్మానం చేశారు. మొదట్లో కొందరికి కష్టంగా అనిపించినా... అందరూ ఏకతాటిపైన నిలబడడం వల్ల మద్యం తాగేందుకు... విక్రయించేందుకు... ఎవరూ సాహసించలేదు. నిన్నటిదాకా మద్యం మత్తులో మునిగిన ఈ గ్రామం..... ఇప్పడు మత్తు వదిలించుకుని... ఆదర్శ గ్రామంగా తయారైంది.
మందుకు స్వస్తి
గుట్టుగా మద్యం విక్రయాలు చేద్దామనుకున్న కొంతమందిని గ్రామస్థులంతా హెచ్చరించడం వల్ల వారంతా విక్రయాలకు స్వస్తి పలికారు. మద్యానికి దూరంగా జరగటంతో... కక్షలు... గొడవలు లేకుండా ఈ గ్రామం ప్రశాంతతకు మారుపేరుగా నిలుస్తోంది.
మద్యానికి దూరం.. అభివృద్ధికి చేరువ
పెద్దపహాడ్లో మద్యనిషేధం... ఆ నోటా ఈ నోటా పక్క గ్రామాలకూ పాకింది. మేం కూడా నిషేధం విధించుకుంటామంటూ.... జనగామ మండలం పసరమడ్ల, గోపిరాజుపల్లి, వెంకర్యాల గ్రామస్థులు ముందుకొచ్చారు. ఇప్పటికే వరంగల్ అర్బన్, మహబూబూబాద్ జిల్లాల్లోనూ కొన్ని గ్రామాలు స్వచ్ఛందంగా మద్యనిషేధాన్ని అమలుపరుస్తున్నాయ్. ఇప్పుడి పల్లెల్లో.. బెల్టు దుకాణాల జాడే కనిపించట్లేదు. తాగడం... తాగి గొడవ చేయడం... పెళ్లాం బిడ్డలను హింసించడం లేదు. మహాత్ముడి ఆశయాలకు అనుగుణంగా.... ఈ పల్లెలు మందుకు దూరంగా జరిగి... అభివృద్ధి దగ్గరై... ఆదర్శ గ్రామాలుగా నిలుస్తున్నాయి.
- ఇదీ చూడండి : బాల్యంలోనే మత్తుకు బానిసలు!