జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలో కడియం ఫౌండేషన్ ఆధ్వర్యంలో చర్చి ఫాదర్లతోపాటు పాస్టర్లకు నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి... వారికి నిత్యావసర సరకులను అందజేశారు.
తనకు రాజకీయ జన్మనిచ్చిన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటానని కడియం శ్రీహరి తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే తమ కుటుంబ సభ్యులతో కలిసి కడియం ఫౌండేషన్ ఏర్పాటు చేసి... గత రెండు నెలలుగా 2500 మంది నిరుపేదలకు సహాయం అందించామన్నారు. ఇక్కడి ప్రజల ఆదరాభిమానాలు తనకు ఎప్పుడూ ఉంటాయని... తన రాకకు ఎవరి అనుమతి అవసరం లేదని చెప్పారు.
కేంద్ర సర్కారు విఫలమైంది...
కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్కు అనుగుణంగా సదుపాయాలు ఏర్పాటు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు కడియం శ్రీహరి. లాక్డౌన్తో సత్ఫలితాలు వచ్చిన.. అంతకుముందే వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపించి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు. కూలీలు, పేదలకు సహాయం అందించేందుకు కేంద్రానికి మనసు రావడం లేదని విమర్శించారు.