పాఠశాలల పరిశుభ్రత నిర్వహణ ఇకపై గ్రామ పంచాయతీలే చూసుకోవాలని త్వరలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనుంది. ఈ మేరకు ఇప్పటికే జిల్లా అధికారులకు మౌఖిక ఆదేశాలు అందాయి. పాఠశాల గదులు, ఆవరణ నిత్యం పరిశుభ్రంగా ఉంచడం ప్రధానోపాధ్యాయులకు ఇబ్బందిగా ఉండేది. ప్రత్యేకంగా స్వీపర్ను నియమించుకుందామంటే అందుకు తగ్గ నిధుల కొరత వేధించేది. ఈ కారణంతో రాష్ట్ట్రంలో చాలా పాఠశాలలకు స్వీపర్లు లేరు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు ఎవరి తరగతి గది వారే శుభ్రం చేసుకునే వారు.
ప్రభుత్వం తాజాగా పాఠశాలల పరిశుభ్రత బాధ్యతను గ్రామ పంచాయతీలకు అప్పగిస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తోంది. గ్రామ పంచాయతీ పర్యవేక్షణలోనే పాఠశాలలు పనిచేస్తాయి. కాబట్టి పాఠశాలల పరిశుభ్రత, సంరక్షణ బాధ్యతలు పంచాయతీలకే అప్పగించడం ఉత్తమమని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి గ్రామ పంచాయతీకి తగినంత సిబ్బంది ఉన్నారు. వీరంతా ఎలాగూ ఆయా గ్రామ పరిధిలోని ప్రతి వీధి తిరిగి తడిపొడి చెత్త సేకరించి డంపింగ్ యార్డుకు చేరవేస్తారు. ఇధి వారి విధుల్లో భాగం. అయితే.. వారిలో ఒకరిని ప్రత్యేకంగా పాఠశాల పరిశుభ్రతకు కేటాయిస్తే అనే విషయం మీద ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆలోచనలు చేస్తున్నారు.లేదా.. వీధుల పరిశుభ్రత పర్యవేక్షించే స్వచ్ఛ భారత్ కార్మికుడితో పాఠశాలను పరిశుభ్రంగా చేయించాలని భావిస్తోంది. కరోనా మూలాన పాఠశాలలు తెరిచే నాటికి ఈ విషయమై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి యోచనలో అధికారులున్నట్లు.. కరోనా కట్టడి అనంతరం పాఠశాలలు పునః ప్రారంభమైన తర్వాత ఈ విషయంలో స్పష్టత వస్తుందని జనగామ జిల్లా విద్యాశాఖాధికారి యాదయ్య తెలిపారు.
ఇదీ చూడండి : విఫలమవడానికి గల కారణాలపై కమిటీ వేశాం : జెన్‌కో సీఎండీ