జనగామలోని పారిశ్రామిక వాడలో ఉన్న శివ జిన్నింగ్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవ శాత్తు చిన్న నిప్పురవ్వ పడి చూస్తూండగానే పత్తి నిల్వలు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. హుటాహుటిన ఘటనస్థలానికి చేరుకుని మంటలు ఆర్పారు. సుమారు రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు.
అగ్ని ప్రమాదం గురించి తెలుసుకున్న ఆర్డీవో మధుమోహన్, వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి ప్రమాద స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అగ్నికీలలు పెద్ద ఎత్తున చెలరేగడం వల్ల సమీప ప్రాంతంలోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదంలో రెండు వేల టన్నుల పత్తి అగ్నికి ఆహుతైంది. సుమారు కోటి రూపాయల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చూడండి: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్ల బదిలీ