కాళేశ్వరం ప్రాజెక్ట్ గొప్ప ఇంజినీరింగ్ అద్భుతమని... ప్రపంచంలో ఎక్కడా ఇంత పెద్ద ఎత్తిపోతల పథకం లేదని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పేర్కొన్నారు. కడియం ఆధ్వర్యంలో జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని కార్యకర్తలు, రైతులతో కలిపి 8 వేల పైచిలుకు మంది కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు బయలుదేరి వెళ్లారు. 19 బ్యారేజ్‌లు, 20 లిఫ్టులు, దాదాపు 4 వేల 600 మెగావాట్ల విద్యుత్త్ ఉపయోగించుకుని 225 టీఎంసీల నీటిని 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని తెలిపారు. రూ. 83 వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్ట్ మొదలైందని ఇప్పటివరకు రూ. 53 వేల కోట్లు ఖర్చు పెట్టి బ్యారేజ్‌లు, పంపుహౌస్‌లు మొదలగు వాటి నిర్మాణం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రాజెక్టుపై రైతులకు అవగాహన కల్పించడానికి సందర్శనకు తీసుకెళ్తున్నట్లు వివరించారు. ప్రాజెక్ట్‌పై అవాకులు, చవాకులు పేలుతున్న ప్రతిపక్షాలు అనవసర విమర్శలు మానుకొని ప్రభుత్వానికి సహకరించాలని అన్నారు.
ఇదీ చూడండి: లండన్ నుంచి వచ్చాడు... అదృశ్యమయ్యాడు