పెట్రోల్ ధరలకు సామాన్యులు బెంబెలెత్తిపోతున్నారు. ఎటైనా వెళ్లాలంటే బండెక్కే జనం.. ఇప్పుడు ఆ మాట వింటేనే భయపడుతున్నారు. పెట్రో మంట నుంచి తప్పించుకునేందుకు ప్రత్యామ్యాయాలు వెతుక్కుంటున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ కూడా ఛార్జీలు పెంచటం వల్ల బస్సులే దిక్కయ్యాయి. బస్సులు సమయానికి అనుకూలంగా ఉండకపోవటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నింటికీ చెక్ పెడుతూ.. ఓ వ్యక్తి తన పెట్రోల్ ద్విచక్రవాహనాన్ని... బ్యాటరీ వాహనంగా తయారు చేసుకున్నాడు.
పెట్రోల్ బైక్ కాస్తా.. ఎలక్ట్రిక్ బైక్‌గా..
జనగామకు చెందిన విద్యాసాగర్ ఎలక్ట్రానిక్ దుకాణం నిర్వహిస్తున్నాడు. తన పని నిమిత్తం ఉళ్లో ద్విచక్రవాహనంపై తిరిగేందుకు రోజుకు రూ. 100 ఖర్చవుతోంది. పెట్రోల్ ధరలు రోజురోజుకు పెరగటం వల్ల.. మరింత భారం పడుతోంది. ఎలాగైనా ఈ ఖర్చు నుంచి తప్పించుకోవాలని తలచాడు. తన మెకానిక్ మేధస్సుతో ఆలోచించాడు. తన వాహనాన్ని ఎలక్ట్రిక్‌గా మార్చితే.. సమస్య పరిష్కారమవుతుందని తెలుసుకున్నాడు. ఇందు కోసం పది వేల రూపాయలతో 4 బ్యాటరీలు, మరో 7500 రూపాయలు వెచ్చించి ఆన్లైన్లో మోటార్‌ను కొనుగోలు చేశాడు. ఓ బైక్ మెకానిక్ సహకారంతో తన ద్విచక్రవాహనానికి బ్యాటరీలు, మోటార్ అమర్చుకున్నాడు. తన వాహనానికి ఉన్న పెట్రోల్ ఇంజిన్‌ను తొలగించాడు. తన ఐడియా విజయవంతమైంది. 5 గంటల పాటు విద్యుత్ ఛార్జింగ్ పెడితే... 50 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేస్తున్నాడు. కేవలం పది రూపాయల ఖర్చుతో రోజు మొత్తం బైక్‌పై తిరుగుతున్నాడు.
నెలకు రూ. 3000 ఆదా...
"నా బైక్‌ను ఎలక్ట్రిక్ వాహనంగా మార్చుకోవటం చాలా సంతోషంగా ఉంది. పెరుగుతున్న పెట్రోల్ ధరలు నన్ను ఈ ఆవిష్కరణ చేసేలా ప్రేరేపించాయి. నా వృత్తిపరంగా నేను రోజూ బైక్‌పై స్థానికంగా తిరగాల్సి ఉంటుంది. అందుకోసం నాకు రోజుకు రూ.100 పెట్రోల్ ఖర్చవుతుంది. ఇప్పుడు మాత్రం కేవలం పది రూపాయలతో రోజు గడిచిపోతోంది. బ్యాటరీలు ఛార్జింగ్ కావడానికి ఒకటి నుంచి ఒకటిన్నర యూనిట్ కరెంటు మాత్రమే ఖర్చవుతుంది. ఇలా చేయటం వల్ల నాకు నెలకు దాదాపు రూ. 3000 ఆదా అవుతున్నాయి."
- విద్యాసాగర్, ఎలక్ట్రానిక్ బైక్ ఆవిష్కర్త