జనగామ మండల రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారుతున్నాయి. తెరాస జడ్పీటీసీ అభ్యర్థిగా బరిలోకి దిగి జిల్లా పరిషత్ చైర్మన్ పదవిపై కన్నేసిన సీనియర్ రాజకీయ నాయకురాలు గాడిపల్లి ప్రేమలత రెడ్డికి చుక్కెదురైంది. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉండి, జనగామ పురపాలక సంఘం ఛైర్పర్సన్గా గాడిపల్లి ప్రేమలత సేవలందించారు. మరో నాలుగు నెలల కాలం మున్సిపల్ ఎన్నికలకు గడువు ఉండగానే పదవికి రాజీనామా చేసి, జనగామ మండల జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. రాజకీయ అనుభవం, పార్టీలో సీనియర్ నాయకురాలిగా పని చేస్తూ ఉండడం వల్ల తనకే తెరాస పార్టీ టిక్కెట్ ఇస్తుందని ఆకాక్షించారు. కానీ చివరి నిమిషంలో పార్టీ వేరే వారికి టిక్కెట్ కేటాయించడం వల్ల కంగుతిన్నారు.
నామినేషన్ను ఉపసంహరించుకోవాలని పార్టీ పెద్దలు సూచించినా తన నామినేషన్ను ఉపసంహరించుకోలేదు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆదేశాలతో ఆమెను పార్టీ నుంచి బహిష్కరించినట్లు మండల నాయకులు తెలిపారు. జడ్పీ చైర్పర్సన్ పదవి మీద ఆశతో మున్సిపల్ ఛైర్పర్సన్ పదవికి రాజీనామా చేయడంతో ఆమె పరిస్థితి రెండువైపులా ఇబ్బందికరంగా మారిపోయిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆమె స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడం విశేషం.
ఇవీ చూడండి: రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ముగిసిన నామినేషన్లు