వరంగల్ అంటేనే సాహిత్యానికి పుట్టినిల్లు లాంటివి. ఇక్కడి భాషను బతికించిన ఎందరో మహానుభావులు ఉన్నారు. ఆ గొప్ప రచయితల గురించి తెలియజేయాలి. మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన పోతన నుంచి మొదలుకొంటే ప్రజాకవి కాళోజీ నారాయణరావు, దాశరథి సోదరుల వరకు తెలుగులో రచనలతో సాహితీ సేవ చేసిన వారు ఉన్నారు. వారి గురించి చెప్పాలి.
మన భాష మాట్లాడుదాం
మాతృ భాషా బాగా మాట్లాడగలిగితేనే పర భాషలను బాగా నేర్చుకోగలరని ఎన్నో విశ్వవిద్యాలయాలు చేసిన పరిశోధనల్లో స్పష్టమైంది. ఈ విషయాన్ని అనేక మంది తల్లిదండ్రులు విస్మరిస్తున్నారు. తల్లి భాష పదికాలాల పాటు బతకాలంటే మొదట మాట్లాడే వారి సంఖ్య తగ్గిపోవద్ధు పిల్లలతో తల్లిదండ్రులు, పెద్దవాళ్లు తెలుగులో మాట్లాడాలి. మన వాడుక భాషలోని అనేక పదాలు క్రమంగా అంతరించిపోవడం పెద్ద ప్రమాదమని గ్రహించాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు నోళ్లలో నానే పదాలెన్నో ఇప్పుడు కనీసం వినిపించడం లేదు. గోలెం, పెరడు, చాన్పి, పుంటికూర, కచ్చరం.. ఇలా పల్లె నుంచి ప్రజలు పట్నాలకు వలస వెళ్లే క్రమంలో అనేక వస్తువుల పేర్లు కనుమరుగయ్యే పరిస్థితి వస్తోంది. వాటి గురించి కనీసం కథలుగానైనా చెప్పాలి.
కథల ద్వారా..
పిల్లలకు భాషపై మక్కువ పెరగాలంటే కథలు ఎంతో తోడ్పడతాయి. కథల్లో సృజనాత్మకత దాగుంటుంది. పిల్లల మేధాశక్తిని పెంచే మెలకువలు ఎన్నో ఉంటాయి. పైగా వాడుక భాష పదాలతో రాసే చిన్న చిన్న కథలు సులువుగా అర్థమవ్వడమే కాదు, పసివాళ్ల మెదళ్లలో భాషా విత్తనాలను నాటుతాయి. కథల్లో నీతి దాగుంటుంది.
ఇలా చేసి చూడండి
- మీకిష్టమైన ఒక అంశం తీసుకొని మరో ఊళ్లో ఉండే మీ తాతయ్యకో, మామయ్యకో, మీ స్నేహితుడికో తెలుగులో ఉత్తరం రాయండి. మళ్లీ వారిని ఉత్తరం ద్వారానే బదులివ్వమని కోరండి. ఆ అనుభూతి భలే ఉంటుంది. మీకు భాషా పరిజ్ఞానమూ పెరుగుతుంది.
- పెద్ద బాల శిక్ష మీ ఇంట్లో లేకపోతే కొనుక్కోండి. అందులో మీకు తెలియని పదాలు, పేర్లు ఒక పుస్తకంలో రాసి పెట్టుకోండి.
- మీరు కలం పట్టుకొని సరదాగా వాన మీదో, లేదా మరో అంశం మీదో ఒక కవిత రాసి చూడండి. మీరూ రచయిత అయిపోవచ్ఛు
- ఆంగ్ల పదాలు లేకుండా ఒక నిమిషం పాటు తెలుగు మాట్లాడే ఓ పోటీని మీ ఇంట్లోనే పెట్టుకోండి. తెలుగుపై మరింత పట్టు పెరుగుతుంది.
- అసలు మీకు తెలుగులో ఎన్ని రకాల సాహితీ ప్రక్రియలు ఉంటాయో తెలుసా? కనీసం 20 రకాలకుపైగా ప్రక్రియలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి.
ఎన్నో ఆన్‌లైన్ వేదికలు
మారుతున్న కాలంలో భాషకు ఎంతో ప్రాధాన్యమిచ్చే ఆన్‌లైన్ వేదికలు ఎన్నో వచ్చాయి. ఆన్‌లైన్ తెలుగు నిఘంటువులు అందుబాటులో ఉంటున్నాయి. ప్రతి సామాజిక మాధ్యమంలో తెలుగులో సమాచారం పంపే విధంగా ఏర్పాట్లు ఉన్నాయి. తెలుగులో ఆడే పజిళ్లు, మెదడుకు పదును పెట్టే ఎన్నో రకాల తెలుగు ఆటలు, ఆన్‌లైన్ కవితల పోటీలు, తెలుగు నేర్చుకోవడానికి మెలకువలు, అనేక రకాల వ్యాసాలు.. ఇలా ఆన్‌లైన్ తెలుగును పరిపుష్ఠం చేయడానికి ఒక మాధ్యమంగా పనిచేస్తోంది.
అన్ని ప్రాంతాల వారికి అర్థమయ్యేది వాడాలి
- అంపశయ్య నవీన్, ప్రముఖ రచయిత
గిడుగు రామ్మూర్తి భాష కోసం ఎంతో తపించారు. అన్ని ప్రాంతాల వారు మాట్లాడే విధంగా తెలుగు ఉండాలని శిష్ట వ్యవహారికాన్ని అమల్లోకి తేవడంలో సఫలీకృతులయ్యారు. ఇప్పుడు మాండలికాలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు. వ్యవహారిక భాషలోనే మాండలికం ఒక భాగంగా రావాలి. అన్ని ప్రాంతాల వారికి అర్థమయ్యే విధంగా భాషను రచనలు, ఇతర మాధ్యమాల్లో వాడితే బాగుంటుంది.
కుటుంబమే బతికిస్తుంది
- త్రిపురారి పద్మ, ఉపాధ్యాయురాలు, బాలసాహితీవేత్త
భాషను బతికించేది కుటుంబమే అని నా అభిప్రాయం. ఇంట్లో వాళ్లు పిల్లలతో తెలుగులో మాట్లాడాలి. ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో ఆంగ్ల భాష ప్రాధాన్యం పెరుగుతున్న క్రమంలో ఇంట్లో వారే పిల్లలకు తెలుగుపై ఆసక్తి కలిగించే విధంగా ప్రోత్సహించాలి. కొందరు ఉపాధ్యాయులు భాష కోసం ఎనలేని కృషి చేస్తున్నారు. ఇప్పుడు పాఠ్యాంశాలు భాషపై మక్కువ పెంచేలా ఉంటున్నాయి.
ఆస్ట్రేలియాలో ఉన్నా అ..ఆలు మరవలే..!
దేవరుప్పుల, న్యూస్‌టుడే: ప్రపంచంలో ఏ దేశానికేగినా మాతృభూమిని, మాతృభాషను మరిచిపోరని ప్రవాస తెలుగువారు ఎక్కడికక్కడ చాటి చెపుతున్నారు. ఆస్ట్రేలియాలో ఉన్న తెలుగు కుటుంబాల వారిని ఫోన్లో పలకరించగా...
వరంగల్ రంగశాయిపేటకు చెందిన ముత్తినేని శ్రీకాంత్ మెల్‌బోర్న్‌లో స్థిరపడ్డారు. ఆయన భార్య శ్వేత గృహిణి కాగా కూతురు హరిచందన (11) ఆరో గ్రేడు, కొడుకు సాయిరాం చరణ్ (6) ఒకటో గ్రేడు చదువుతున్నారు. వారికి తెలుగు నేర్పడంసహా ఇంటిల్లిపాదీ మాతృభాషలోనే మాట్లాడుతుంటారు.
దేవరుప్పులకు చెందిన కాసం వేంకట శశిధర్, శ్వేత దందపతులు మెల్‌బోర్న్‌లో నివాసముంటున్నారు. నాలుగేళ్ల కూతురు రూపేశ్వరికి ఇప్పుడిప్పుడే తెలుగు వర్ణమాల నేర్పుతున్నారు. తెలుగు భాష మాధుర్యాన్ని ఆస్వాదించగలుగుతున్నామని చెప్పారు.