Chlorine Gas Leakage in Jangaon: నీటి శుద్ధి ప్రక్రియలో వినియోగించే గ్యాస్ సిలిండర్ నుంచి క్లోరిన్ వాయువు లీకైన ఘటన జనగామ ప్రజలను భయాందోళనకు గురి చేసింది. వాయువు పీల్చిన సుమారు 100 మంది అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లా కేంద్రంలోని సబ్ జైలు పక్కనే ఉన్న మున్సిపల్ నీటి ట్యాంకు వద్ద కొన్నేళ్లుగా వృథాగా ఉంటున్న క్లోరిన్ గ్యాస్ సిలిండర్ లీకైంది. గురువారం సాయంత్రం ప్రారంభమైన లీకేజీ.. రాత్రి 7 తర్వాత ఉద్ధృతమైంది. విషయం తెలుసుకున్న నీటి సరఫరా సిబ్బంది.. సూపర్‌వైజర్‌కు సమాచారం అందించారు.
Chlorine Gas Leak in Jangaon : సూపర్‌వైజర్ సూచన మేరకు సిలిండర్‌ను పక్కనే ఉన్న నీటి సంపులో వేయగా.. క్లోరిన్ వాయువు లీకేజీ పాక్షికంగా ఆగిపోయింది. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైంది. కొద్దికొద్దిగా లీక్ అవుతున్న క్లోరిన్ ప్రభావాన్ని పూర్తిగా తగ్గించేందుకు సంపులోకి మంచినీటిని అధికంగా వదిలారు. దీంతో సమస్య తగ్గకపోగా మరింత తీవ్రమైంది.
ఈ నీరు క్లోరినేషన్‌తో పాటు, పొటాష్ ఆలం మిశ్రమం కలిపింది కావడంతో నీరంతా బయటకు ఉప్పొంగింది. ఈ క్రమంలో నీరు బయటకు ప్రవహించినంత దూరం ఘాటైన వాసన వ్యాపించింది. సమీపంలోని ఈద్గా వెనుక కాలనీలు, ఆర్ అండ్ బీ అతిథి గృహం రహదారి మీదుగా వెళ్లేవారు, గీతానగర్, పరిసరాలపై దీని ప్రభావం పడింది. లీకవుతున్న గ్యాస్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియక ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఒకదశలో స్థానిక జనరల్ ఆసుపత్రి నుంచి వాయువులు లీకయ్యాయనే ప్రచారం జరిగింది. దీంతో ఆసుపత్రి పర్యవేక్షకులు సిబ్బందిని అప్రమత్తం చేసి, పరిశీలన జరిపారు. చివరకు అక్కడ ఏం లేదని ధ్రువీకరించారు.
అత్యవసర సేవల కోసం హెల్ప్‌లైన్..: రాత్రి 10 తర్వాత లీకేజీ నిలిచిపోయింది. గ్యాస్ పీల్చిడం వల్ల కళ్లు తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, తల తిరగడం, వాంతి తదితర సమస్యలతో సుమారు 100 మంది అస్వస్థతకు గురికాగా.. అందులో కొందరు జనరల్ ఆసుపత్రిలో.. మరికొందరు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం లేదని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కలెక్టర్‌కు ఫోన్ చేసి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. జిల్లా అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయి ఆసుపత్రికి చేరుకొని అస్వస్థతకు గురైన వారిని పరామర్శించారు. అత్యవసర వైద్య సేవల నిమిత్తం ప్రజలు హెల్ప్ లైన్ నెంబర్ 6304093907ను సంప్రదించాలని తెలిపారు.
ఇవీ చూడండి..
లిఫ్ట్ చేస్తారో లేదోనని.. డయల్ 100కు ఫేక్ కాల్స్
బట్టల దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం.. 100 షాపులకు మంటలు.. 20 ఫైరింజన్లతో..