Yerukala Language Lipi Developed by Indrani : భారతదేశం విభిన్న భాషలకు పట్టుకొమ్మ. ఒక్కో ప్రాంతంలో ఒక్కో భాష. గిరిజన, సంచార తెగల భాషల్లో ఈ వైవిధ్యం ఇంకా ఎక్కువ. అలాంటి వాటిల్లో ఎరుకల భాష ఒకటి. ఇన్ని తరాలు గడిచినా ఆ భాష లిపి లేకపోవడం తనను కదిలించింది. చిన్నప్పటి నుంచి భాషాభిమాని అయిన ఆ యువతి ఎరుకల భాషకు లిపి కనిపెట్టే ప్రయత్నంలో ఇప్పటివరకు సాగిన తన ప్రయాణంతో అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.
Venkaiah Naidu: మన మూలాలను తెలియజెప్పే సారథి ‘భాష’ : వెంకయ్య
ఈమె పేరు ఇంద్రాణి మామిడిపల్లి. స్వస్థలం జగిత్యాల జిల్లా పొలాస. ప్రస్తుతం ఇబ్రహీంనగర్‌లో ఉంటోంది. నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. పాఠశాల స్థాయి నుంచే సాహిత్యంపై ఆసక్తి పెంచుకున్న తన క్రమంగా భాషంటే అభిమానం ఏర్పడింది. ఎరుకల తెగకు చెందిన తన స్నేహితురాలితో మాట్లాడిన సందర్భంలో దానికొక లిపి సృష్టించాలనే ఆలోచన వచ్చిందంటోంది ఇంద్రాణి.
Yerukala Language Script : ఏ విషయంలో అయినా ఆవిష్కరణ జరగాలంటే మనసులో, మెదడులో ఓ మినీ యుద్ధమే జరగాలి. ఇక్కడా అదే జరిగింది. తన ఊరి చివర ఉన్న రెండు కుటుంబాల దగ్గరికెళ్లి అనేక విషయాలు అధ్యయనం చేసింది ఇంద్రాణి. ఎంతో మంది భాషాభిమానుల్ని, మేధావుల్ని కలిసి ఈ ప్రకియను ముందుకు తీసుకెళ్తోంది. ముందు అవాంతరాలు ఎదురైనా.. కష్టానికి గుర్తింపు దక్కడం మొదలైంది అని, అది తనకు మరింత ఉత్సాహాన్నిచ్చిందని చెబుతోంది.
ఎరుకల భాషను గురించి వివరిస్తూ అది తెలుగు, తమిళ, కన్నడలకు చాలా దగ్గరగా ఉందని చెబుతోంది ఇంద్రాణి. ఈ భాష అర్థం చేసుకునేందుకు చాలా తక్కువ సమయం పట్టిందనీ అంటోంది. భాష అంతరిచిపోవడమంటే జాతి మనుగడ ప్రశ్నార్థకం కావడమని.. ఎప్పటికీ ఎరుకల భాష తన మనుగడ సాగించేందుకు తన వంతు సాయమే లిపి సృష్టి అని ఆనందంగా చెబుతోంది.
చిన్నప్పటి నుంచి ఇలాంటి కొత్తకొత్త విషయాల పట్ల ఆసక్తి కనబరిచేది ఈ యువతి. అదే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని చెబుతోంది. ఈమె భాష పట్ల చేసిన కృషికి గానూ గవర్నర్ తమిళసై చేతుల మీదుగా 2023 సంవత్సరానికి గానూ సావిత్రిభాయి పూలే అవార్డు అందుకుంది. ఈ లిపిని నిపుణులు, భాషా కోవిదులు, కుల పెద్దల సహకారంతో ముందుకు తీసుకెళ్తానంటోంది. భవిష్యత్‌లో సివిల్స్ సాధించడమే తన లక్ష్యమంటోంది ఇంద్రాణి.
తమ కుమార్తె ఈ లిపి కోసం చాలా కష్టపడిందని చెబుతున్నారు ఇంద్రాణి తండ్రి. చాలా విషయాలు శోధించి ఇలా అందరిముందుకు రావడం సంతోషమంటున్నారు. ఇంద్రాణి కుమ్మరి సామాజికవర్గానికి చెందిన అమ్మాయైనా.. ఎరుకల లిపి కోసం కృషి చేస్తోంది. తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు చెబుతోంది. ముఖ్యంగా కుటుంబ ప్రోత్సాహం మరవలేనిదని అంటోంది.
"నా స్నేహితురాలు ఎరుకల భాష మాట్లాడేటప్పడు.. ఆ భాషను నేర్చుకోవాలనిపించింది. కానీ భాషకు లిపి లేదని చెప్పడంతో.. ఎరుకల భాషకు లిపిని అభివృద్ధి చేద్దామని అనుకున్నాను. ఎరుకల భాష కన్నడ, తెలుగు పదాల కలయికగా ఉంటుంది. పూర్తి స్థాయిలో ఎరుకల భాషకు లిపిని అభివృద్ధి చేస్తా". - ఇంద్రాణి, ఎరుకల లిపి సృష్టికర్త