Warden Attack on Student : జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని మైనారిటీ గురుకుల కళాశాలలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఇంటర్ విద్యార్థి తాను చెప్పినట్లు వినడం లేదని.. కళాశాల నిబంధనలు పాటించడంలేదని ఆగ్రహించిన వార్డెన్ ఆ విద్యార్థిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడికి సంబంధించిన వీడియోలు సీసీటీవీలో రికార్డయి.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.
కళాశాలలో ఆర్ట్ టీచర్‌గా పని చేస్తున్న సాగర్‌కు, డిప్యూటీ వార్డెన్ నయీమ్‌కు గతంలో విభేదాలొచ్చాయి. సీసీటీవీ ఫుటేజీ గురించి తెలుసుకున్న సాగర్ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈనెల 11న జరిగిన ఈ సంఘటన వీడియో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. వారు వెంటనే చర్యలు తీసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్‌కు ఆదేశాలు జారీ చేశారు. విచారణ జరిపిన ప్రిన్సిపాల్ సాబిద్ అలీ... ఆర్ట్ టీచర్ సాగర్, వార్డెన్ నయీమ్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు.
విద్యార్థిపై దాడి చేసిన డిప్యూటీ వార్డెన్ నయూమ్‌కు వారం రోజుల క్రితమే షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. 'తాను చెప్పినట్లు వినకుండా డార్మిటరీ రూమ్‌కు వెళ్లాడని నయూమ్.. విద్యార్థిపై దాడి చేశాడు. మొదట పిడిగుద్దులు గుద్దిన నయీమ్.. విద్యార్థి కింద పడగా.. కాళ్లతో తన్నాడు'అని ప్రిన్సిపాల్ తెలిపారు. అతడిపై చర్యలు తీసుకుని సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.