జగిత్యాల జిల్లా కోరుట్ల పురపాలిక పరిధిలోని ఎకిన్పూర్లో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తాతా మనవరాలు విద్యుదాఘాతంతో చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఎకిన్పూర్కు చెందిన మల్లయ్య గ్రామంలో వ్యవసాయ పనులు చేస్తాడు. మౌనిక తండ్రి విదేశాల్లో ఉండడంతో ఆమె తాత వద్దనే ఉంటూ చదువుకుంటోంది. వారి ప్రేమను చూసి విధికి కన్ను కుట్టినట్టుంది. కరెంట్ రూపంలో ఇరువురిని ఒకేసారి బలి తీసుకుంది.
ఏం జరిగిందంటే..?
గేదె ఉదయాన్నే ఒకటే అరుస్తోంది. మల్లయ్య భార్య బయటకు వచ్చి చూసింది. కొద్దిసేపటికి ఆమె కేకలు వేయగా... తాత, మనవరాలు ఏం జరిగిందో చూసేందుకు వచ్చారు. బయటకు వెళ్లిన వారు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే మల్లయ్య భార్య పక్కింటి వారిని లేపింది. చుట్టూ పరిశీలించగా... విద్యుత్ తీగలు పడి ఉన్నాయి. వెంటనే వారు విద్యుత్ శాఖకు సమాచారం ఇవ్వగా... సరఫరా నిలిపివేశారు. విద్యుదాఘాతంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
నిన్నటి వరకు సంతోషాలను పంచుకుంటూ... ఆనందంగా గడిపిన తాత, మనవరాలు ఒకేసారి కానరాని లోకాలకు వెళ్లడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కోరుట్లలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి: కరోనా భయం: జేసీబీతో యువకుడి మృతదేహం ఖననం