ఎల్లంపల్లి నుంచి నీటిని ఎత్తిపోసి ఎస్సారెస్పీని నింపేలా రూ.1067 కోట్లతో పునరుజ్జీవ పథకాన్ని చేపట్టారు. దీంతో ఎస్సారెస్పీకి జల అభయం కలగగా దిగువన వరదకాలువ నుంచి నేరుగా కొంత నీటిని కాకతీయ కాలువలోకి తరలించనున్నారు. రూ.36.82 కోట్లతో చేపట్టిన వరదకాలువ, కాకతీయ కాలువల అనుసంధానంతో పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్ జిల్లాలు, మధ్యమానేరుకు నీరు నేరుగా ఎల్లంపల్లి నుంచి తరలనుంది. ఎస్సారెస్పీపై చాలావరకు భారం తగ్గుతుంది.
ఎస్సారెస్పీ పరిధిలో కేవలం జగిత్యాల జిల్లాలోనే అధికంగా ఆయకట్టు ఉంది. జిల్లాకు అమితంగా ఉపకరించనున్న ఎస్సారెస్పీ పరిధిలో ఆయకట్టులో శాశ్వత మరమ్మతులు చేపట్టినట్లయితే ఎత్తిపోసిన నీరు పూర్తిగా సద్వినియోగమవుతుంది. కానీ ఇటీవల నిధులు విడుదలకానందున శాశ్వత మరమ్మతులు చేపట్టడంలేదు. కేవలం ఉపాధిహామీ నిధులతో కాలువల్లో పూడికతీత వంటివి చేపడుతున్నారు.
అభివృద్ధి ఆవశ్యకత
కాకతీయ, వరదకాలువల పరిధిలో దాదాపుగా 70 వరకు తూములను ఏర్పాటు చేసి 690 వరకు చెరువులు, కుంటల్లోకి నీటిని తరలించే ఏర్పాట్లు చేస్తుండటంతో మరమ్మతుల ఆవశ్యకత వచ్చిపడింది. శ్రీరాంసాగర్‌లో ఇటీవల 90.313 టీఎంసీల నీటినే నిల్వచేస్తున్నారు. కానీ ప్రాజెక్టు గరిష్ఠ సామర్థ్యం 112 టీఎంసీల వరకు నీటిని నిల్వచేసేలా చర్యలు చేపడితే తదుపరి సీజన్లకు నిల్వ జలాలు ఉపకరిస్తాయి.
కాలువనీళ్లను అన్ని చెరువులు, కుంటల్లోకి మళ్లించేలా ఏర్పాట్లు చేయాలి, చెరువుల్లోకి నీటిని తరలించే ఉపకాలువల ఆక్రమణలను తొలగించాలి. రోళ్లవాగు తదితర ప్రాజెక్టులు, వందలాది చెరువులు, కుంటలకు కాలువనీరు ఆధారంగా ఉంది. ఆయకట్టులో నిర్మాణాలు శిథిలం కావడంతో 25 వేల ఎకరాలకు పైగా విస్తీర్ణానికి సాగునీరందడం లేదు. కాలువలకు గండ్లు పడటం, చెట్లు పెరగటం, షట్టర్లు, లైనింగ్ దెబ్బతినటం, కట్ట శిథిలం కావటం తదితర కారణాలతో కాకతీయ కాలువ సామర్థ్యం 9,300 క్యూసెక్కుల నుంచి 6,500 క్యూసెక్కులకు తగ్గింది.
డిస్ట్రిబ్యూటరీలు, ఉపకాలువల పరిధిలోనూ లైనింగ్ పూర్తిగా చెడిపోవటం, యూటీలు, డ్రాపులు, సూపర్‌ప్యాసేజ్‌లు, అక్విడెక్టులు తదితర నిర్మాణాలు దెబ్బతినటంతో ఏ కాలువనిండా నీటిని తరలించలేని పరిస్థితి తలెత్తింది. ఫలితంగా జిల్లాలోని చివరి గ్రామాల భూములకు సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కాలువల్లో పూడికతీసి వదిలేయకుండా దెబ్బతిన్న సిమెంట్ నిర్మాణాలకు శాశ్వత మరమ్మతులు కల్పించేలా నిధులు విడుదల చేయాల్సి ఉంది.