జగిత్యాల జిల్లా లక్ష్మిపూర్‌కి చెందిన మల్లారెడ్డి ఓ ప్రైవేట్ పాఠశాల నడిపేవారు. కరోనా కారణంగా ఏడాది నుంచి పాఠశాలను మూసివేశారు. అనంతరం ఏం చేయాలో తెలియక తనకున్న 7 ఎకరాల వ్యవసాయ భూమిలో సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. సాంప్రదాయ పంటలు పండించకుండా నూతన సాగుకు శ్రీకారం చుట్టారు. నాటు కోళ్ల పెంపకంతో పాటు కూరగాయలు, పండ్ల తోటలు పెంచుతున్నారు. నేల, వాతావరణ పరిస్థితులను బట్టి సాగుకు అనుకూలమైన పంటలను ఎంచుకుంటున్నారు.
ఉపాధి లేకపోవటంతో..
గత ముప్పై సంవత్సరాలుగా పాఠశాల నిర్వహించిన మల్లారెడ్డి.. కొవిడ్ నేపథ్యంలో ఉపాధి లేకపోవటంతో వ్యవసాయం బాట పట్టారు. వ్యవసాయ క్షేత్రంలో వంకాయ, నేతిబీర, దోస, మునగ వంటి కూరగాయాలతో పాటు జామ, బొప్పాయి, మామిడి, అంజూర పళ్లను సాగు చేస్తున్నారు. వాటర్ యాపిల్ , కరొండ , సీతాఫల్ , రెడ్ యాపిల్, ఫ్యాషన ఫ్రూట్, రెడ్ బనానా, డ్రాగన్ ఫ్రూట్ వంటివి పండిస్తున్నారు. వివిధ నర్సరీల నుంచి సుమారు 76 రకాల పండ్ల మెుక్కలను తీసుకువచ్చినట్లు మల్లారెడ్డి తెలిపారు. మార్కెట్‌లో అనుకున్న ధర రాకపోవటంతో వ్యవసాయ క్షేత్రంలోనే విక్రయిస్తున్నారు. రోజుకి 5 వేలకు పైగా ఆదాయం వస్తుందని మల్లారెడ్డి తెలిపారు.
కరోనా కారణంగా పాఠశాల నిర్వహణలేకపోయిన సాగులో ఆదాయం పొందుతున్నానని మల్లారెడ్డి తెలిపారు. భవిష్యత్తులోనూ వ్యవసాయం కొనసాగిస్తానని వెల్లడించారు.
ఇదీ చదవండి: లాక్డౌన్ దెబ్బకు రూ.50లక్షలకు పడిపోయిన ఆదాయం