శ్రీరామనవమిని పురస్కరించుకుని నిర్వహించే భద్రాచల సీతారాముల కల్యాణంలో వినియోగించే బియ్యాన్ని తలంబ్రాలుగా మలిచే కార్యక్రమం కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సీతారాముల తలంబ్రాల కోసం పండించిన వడ్లను తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ నుంచి జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని శ్రీ స్వయంభూ హనుమాన్ ఆలయానికి తీసుకొచ్చారు. సీతారాముల చిత్రపటంతో పాటు తలంబ్రాల వడ్లను మంగళ హారతులు, మేళతాళాల మధ్య భక్తిశ్రద్ధలతో ఊరేగించారు.
అనంతరం ఆలయానికి తీసుకొచ్చి... జానకీరాఘవుల చిత్రపటం ముందు రామ భజన చేస్తూ భక్తులు బియ్యంగా ఒలిచారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్దఎత్తున పాల్గొని భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. రామనామంతో పరిసరాలు మారుమోగిపోయాయి. సీతారాముల కల్యాణానికి వెళ్లకుండా... స్వయానా ఇక్కడే భద్రాచలం వెళ్లి కల్యాణంలో పాల్గొన్న అనుభూతి కలిగిందని భక్తులు పరవశించిపోయారు.