ముంబయి నుంచి బయలు దేరిన శ్రామిక్ రైలు జగిత్యాలకు చేరుకుంది. శుక్రవారం రాత్రి 842 ప్రయాణికులతో బయలుదేరిన శ్రామిక్ రైలు లోకమాన్య తిలక్ టెర్మినల్ ఎక్స్ప్రెస్ జగిత్యాలకు శనివారం సాయంత్రం చేరుకుంది. మెుత్తం 842 మందిలో 337 మంది ప్రయాణికులు మాత్రమే జగిత్యాల రైల్వే స్టేషన్లో దిగినట్లు సమాచారం. మిగతా వారు రైలు సిగ్నల్ కోసం ఆగినపుడు దిగి ఉంటారని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
వారి కోసం అధికారులు ఆరా తీస్తున్నారు. జగిత్యాల స్టేషన్లో దిగిన కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి... క్వారంటైన్ ముద్రవేసి ప్రత్యేక బస్సుల ద్వారా వారి వారి గమ్యస్థానాలకు చేర్చారు. జూన్ 17 వరకు క్వారంటైన్లో ఉండాలని వారికి సూచించారు. జగిత్యాల అదనపు కలెక్టర్ రాజేశం, జిల్లా వైద్యాధికారి ఉప్పల శ్రీధర్ పర్యవేక్షించారు. పెద్ద సంఖ్యలో వైద్య సిబ్బంది, పోలీసులు రైల్వే స్టేషన్లో ఉండి కార్మికులను వారివారి ఇళ్లకు పంపే ఏర్పాటు చేశారు. ముంబయిలో చిక్కుకుపోయిన వారంతా ఇళ్లకు చేరడం వల్ల కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: కరోనా వ్యాప్తిని తెలుసుకునేందుకు రంగంలోకి ఐసీఎంఆర్