ఈటీవీ భారత్ కథనానికి అధికారులు స్పందించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి ఆర్టీసీ డిపోలో 'అదనపు ఆదాయం కోసం ఉద్యోగులపై ఒత్తిడి'కి గురి చేస్తున్నారని ఈటీవీ భారత్తో కార్మికులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈటీవీలో ప్రసారమై.. ఈనాడు పత్రికలో వచ్చిన కథనానికి స్పందించిన ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జీవన్ ప్రసాద్ ఆకస్మిక తనిఖీ చేశారు.
డిపోలో బస్సులకు మరమ్మతులు చేస్తున్న ఉద్యోగుల వద్దకు వెళ్లి వారి పనిని పరిశీలించారు. అనంతరం డిపోను పూర్తిస్థాయిలో పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. ఆర్టీసీ ఉద్యోగులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారంలో ప్రతి రోజు విధులు నిర్వహించటంతో ఇబ్బందులకు గురవుతున్నామని కార్మికులు వాపోయారు. గతంలో ఉన్న విధంగానే విధులు అప్పగించాలని కార్మికులు ఆర్ఎంని కోరారు.
ఆర్టీసీ ఉద్యోగులకు ఎలాంటి సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని.. వెంటనే సమస్యకు పరిష్కారం చూపుతామని జీవన్ ప్రసాద్ స్పష్టం చేశారు. కార్మికులు, ఉద్యోగులు, అధికారుల సమష్టి కృషితోనే ఆర్టీసీ అభివృద్ధి బాటలో నడుస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'అదనపు ఆదాయం కోసం ఉద్యోగులపై ఒత్తిడి'