mission bhagiratha problems: జగిత్యాల జిల్లా మెట్పల్లి పురపాలక పరిధిలోని ఏ వీధి చూసినా.. గుంతలే స్వాగతం పలుకుతుంటాయి. ఎక్కడ చూసినా.. తవ్విన రోడ్లు.. దర్శనిమిస్తుంటాయి. కారణం.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం ఫలితం. పథకం ప్రారంభించి ఇప్పటికీ మూడేళ్లు గడిచినా పనులు నత్తనడకన జరుగుతున్నాయి. పైపులైన్లు వేసేందుకు కోట్ల రూపాయలతో గతంలో వేసిన సీసీ రోడ్లను తవ్వారు. అనంతరం పనుల్లో పురోగతి లేకపోవటంతో...ఎక్కడ చూసినా గుంతలే దర్శనమిస్తున్నాయి.
స్థానికులకు తప్పని ఇబ్బందులు
roads damaged: రహదారులు అస్తవ్యస్తంగా మారటంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఒక వీధిలో చేపట్టిన పనులు మధ్యలోనే ఆపేసి... మరో చోట పనులు ప్రారంభించడంతో కష్టాలు తప్పడం లేదు. చెడిపోయిన రహదారులపై నడవడానికి ప్రజలు ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వీధుల్లో పైపులైను వేసిన తర్వాత మిగిలిన పైపులను తీసుకెళ్లకుండా రహదారులపైనే వదిలివేయడం వల్ల ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు.
ఇష్టానుసారంగా పనులు..
భగీరథ పనుల్లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా గుత్తేదారులు ఇష్టానుసారంగా పనులు చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. రహదారులు పాడవ్వటంతో రాత్రివేళ వృద్ధులు, చిన్న పిల్లలు కింద పడుతున్నారని తెలిపారు. అధికారుల పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడం వల్ల గుత్తేదారులు ఇష్టానుసారంగా పనులు నిర్వహిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పనులు త్వరతగిన పూర్తి చేయాలని... రహదారులు మరమ్మతులు చేయాలని విజ్ఞప్తి చేశారు.
నీళ్లందేది ఎప్పుడో..
ప్రజలకు తాగునీరు అందించేందుకు పట్టణంలోని మూడు స్థలాలను ఎంపిక చేసి పెద్ద వాటర్ ట్యాంకు నిర్మాణాలను చేపట్టారు. మండల పరిషత్ ఆవరణతో పాటు ఖాదీ ఆవరణలో వ్యవసాయ మార్కెట్లో వాటర్ ట్యాంకుల నిర్మాణం జరుగుతోంది. ఆ పనుల పరిస్థితి కూడా ఎక్కడి వేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగానే ఉన్నాయి. ఇక ఈ పనుల పరిస్థితి చూసి.. భగీరథ నీటిని ఎప్పుడు తాగుతామోనని ప్రజలు నిట్టూరుస్తున్నారు.
ఇకనైనా మిషన్ భగీరథ పనులను తొందరగా పూర్తిచేయాలని పట్టణవాసులు డిమాండ్ చేస్తున్నారు. అన్ని వార్డుల్లో చెడిపోయిన రహదారులను పూర్తిగా మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
ఇదీ చూడండి: