Political War in Jagtial Constituency : తెలంగాణ ఆవిర్భావం తరువాత.. జరిగిన ప్రతి ఎన్నికలోనూ జగిత్యాలలో ఆ ఇద్దరు నేతల మధ్యే పోటీ జరుగుతోందా..? అన్న అనుమానం కలగక మానదు. ఆ ఇద్దరే.. జగిత్యాల కాంగ్రెస్(Telangana Congress) అభ్యర్థి తాటిపర్తి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. 2014 నుంచి మొదలుపెడితే.. ప్రస్తుత ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
Telangana Assembly Elections 2023 : మూడు ఎన్నికల్లోనూ గులాబీ పార్టీ(BRS) నుంచి డాక్టర్ సంజయ్ అభ్యర్థిగా బరిలో నిలిచినప్పటికీ.. ఇక్కడి నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న జీవన్‌రెడ్డి మాత్రం కల్వకుంట్ల కవితతోనే తలపడుతున్నట్టుగా ఉంటోంది. ఇందుకు కవిత సైతం దీటుగా బదులిస్తుండటం వల్ల జగిత్యాల రాజకీయం ఆసక్తికరంగా మారింది. రాజకీయాలతో అంతగా సంబంధం లేని నేత్ర వైద్యుడైన సంజయ్‌ను కవిత.. జగిత్యాల అభ్యర్థిగా ఎంపిక చేయించారు.
"జీవన్‌రెడ్డికి సీనియారిటీ ఉంది కానీ సిన్సీయారిటీ లేదు. అతను ఏం మాట్లాడుతున్నారో.. అతనికే అర్థం కావడంలేదు. చక్కెర ఫ్యాక్టరీని నిజాం కాలంలో కట్టించారు. కానీ కాంగ్రెస్ నాయకులు తమ పార్టీ కట్టించినట్లుగా గొప్పలు చెప్పుకుంటున్నారు". - కవిత, ఎమ్మెల్సీ
MLC Kavitha Vs MLC Jeevan Reddy in Jagtial : 2014 ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసిన కవిత.. తన గెలుపుతో పాటు డాక్టర్ సంజయ్ గెలుపును సవాల్‌గా తీసుకున్నారు. అయితే అప్పుడు జీవన్‌రెడ్డి కూడా కవిత ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ముందుకు సాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ ఎన్నికల్లో జీవన్‌రెడ్డి గెలవడంతో డాక్టర్ సంజయ్ తొలి ప్రయత్నంలో విఫలమయ్యారు. నిజామాబాద్ ఎంపీగా గెలిచిన కవిత.. జగిత్యాలపైనే ఎక్కువ దృష్టిసారించారు.
BRS VS Congress in Jagtial : 'మన ఊరిలో మన ఎంపీ' కార్యక్రమాన్ని కూడా జగిత్యాల నియోజకవర్గంలోనే చేపట్టారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాలలోనే మకాం వేసి మరీ డాక్టర్ సంజయ్ గెలవడంలో కవిత కీలకపాత్ర పోషించారు. తరువాత జరిగిన ఎన్నికల్లో జీవన్‌రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీగా, ఎంపీగా ఓటమి తర్వాత కవిత స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికవడం వల్ల.. ఇద్దరూ ఒకే సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
"కవిత ఎంపీగా ఉన్న అయిదేళ్ల కాలంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. మెట్పల్లిలో ఉన్న చక్కెర ఫ్యాక్టరీని వందశాతం ప్రభుత్వ పరం చేస్తామని చెప్పి.. పూర్తిగా ప్రైవేట్‌పరం చేశారు. ఆమె ఎంపీగా ప్రాతినిథ్యం వహించిన ప్రాంతంలో అభివృద్ధి శూన్యం". - జీవన్‌రెడ్డి, కాంగ్రెస్ నేత
ప్రస్తుత ఎన్నికల్లోనూ జీవన్‌రెడ్డి.. ప్రత్యర్థిగా బరిలో నిలిచిన డాక్టర్ సంజయ్‌ని కాకుండా ఎమ్మెల్సీ కవితపై ఎక్కువగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. జీవన్‌రెడ్డి విమర్శలకు దీటుగా బదులిస్తున్న కవిత.. సంజయ్ గెలుపు కోసం ప్రత్యక్షంగా ప్రచార బరిలో దిగారు. ప్రచార గడువు దగ్గరపడే కొద్దీ.. కవిత, జీవన్ రెడ్డిల మధ్యే పోటీ అన్నట్టుగా రాజకీయ పరిణామాలు మారుతాయని నేతలు అంచనావేస్తున్నారు.