Ethanol Rice Bran Oil Company : జగిత్యాల, ధర్మపురి ప్రాంతంలో వరి, మొక్కజొన్న ఎక్కువగా సాగవటం, పుష్కలమైన నీరు అందుబాటులో ఉంది. రోడ్డుతో పాటు దగ్గరలో మంచిర్యాల, పెద్దపల్లి రైలు మార్గాలు, రామగుండం ఎరువుల కర్మాగారం ఉండటంతో పరిశ్రమ ఏర్పాటుకు క్రిభ్‌కో ఆసక్తి చూపింది. కంపెనీ విస్తరణలో భాగంగా జగిత్యాల జిల్లా స్తంభంపల్లి వద్ద ఇథనాల్ బ్రాన్ ఆయిల్ పరిశ్రమను త్వరలోనే ఏర్పాటు చేస్తామని క్రిభ్‌కో కంపెనీ ప్రకటించింది. వెల్గటూర్ మండలం స్తంభంపల్లి శివారులోని 1091 సర్వే నంబర్‌లో కంపెనీ ఏర్పాటుకు భూమి చదును చేయడంతోటే ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనకు శ్రీకారం చుట్టారు. రూ.750 కోట్ల ఫ్యాక్టరీ నిర్మిస్తే ఏడాదికి ఎనిమిది కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యంతో కంపెనీని స్థాపించవచ్చని క్రిభ్‌కో ఛైర్మెన్ ప్రకటించారు. ఈ ప్రాంతంలో ధాన్యం, మక్క ఎక్కువ సాగు కావడం, పుష్కలమైన నీరు ఉండడం, రోడ్డుతోపాటు దగ్గరలో మంచిర్యాల, పెద్దపల్లి రైలు మార్గాలు అందుబాటులో ఉండడం కంపెనీ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని చెప్పారు. దగ్గరలోనే రామగుండం ఎరువుల తయారీ కంపెనీ కూడా ఉండడం కలిసి వస్తుందన్నారు.
మెరుగ్గా ఉపాధి అవకాశాలు: ఈ పరిశ్రమ ఏర్పాటైతే ధర్మపురి ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని ప్రత్యక్షంగా, పరోక్షంగా 1500 మందికి ఉపాధి అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. వరి, మక్క, నూకలతో ఇథనాల్ తయారవుతుంది. ఈ ప్రాంత రైతులకు వరి, మక్క ఎక్కడ అమ్ముకోవాలన్న ఆందోళన ఉండదని నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో భూమి చదును చేయడంతోటే ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో ఫ్యాక్టరీ నిర్మించవద్దని డిమాండ్ చేస్తున్నారు. వివిధ పద్దతుల్లో తమ నిరసనను కొనసాగిస్తున్నారు.
భూమిపూజతో మొదలైన వివాదం: మార్చి 31న సుమారు 110 ఎకరాల్లో దాదాపు రూ.750 కోట్ల అంచనా వ్యయంతో పరిశ్రమ ఏర్పాటుకు మంత్రి కొప్పుల ఈశ్వర్ భూమి పూజ చేయటంతో వివాదం మొదలైంది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో సమీప గ్రామాల్లో సుమారు 200 మంది బీఆర్ఎస్ శ్రేణులు తమ పదవులకు రాజీనామా చేశారు. పాశిగామ సర్పంచ్ ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా గ్రామ పంచాయతీలో తీర్మానం చేశారు. అభిప్రాయ సేకరణ లేకుండా, కనీసం గ్రామ సభ జరపకుండా పరిశ్రమ ఏర్పాటుకు ఎలా అనుమతిస్తారని స్తంభంపల్లి గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసు బందోబస్తుతో పనులు చేసేందుకు యత్నించటంతో ఆయా గ్రామాల ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలతో నిరసనలు తెలుపుతున్నారు.
ఇథనాల్ రైస్ బ్రాన్ ఆయిల్ పరిశ్రమతో సుమారు 3 వేల మంది యువతకు ఉపాధితో పాటు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని భూముల విలువ భారీగా పెరగటంతో పాటు ఇథనాల్ తయారీకి అవసరమైన వరి, మొక్కజొన్నల సేకరణ ద్వారా రైతులకు మేలు జరుగుతుందని వివరిస్తున్నారు. సమీప గ్రామాల ప్రజలు మాత్రం ససేమిరా అనటంతో వివాదం కొనసాగుతోంది.
ఇవీ చదవండి: