జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అంజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తన ప్రచార రథం ‘వారాహి’కి వేదపండితులతో శాస్త్రోక్తంగా పూజలు చేయించిన తర్వాత దానిని ఆయన ప్రారంభించారు. పవన్‌ను చూసేందుకు అభిమానులు, జనసేన కార్యకర్తలు కొండగట్టుకు భారీగా తరలివచ్చారు. గజమాలతో ఆయనను సత్కరించారు. అభిమానులకు ఓపెన్‌టాప్ వాహనం నుంచి పవన్ అభివాదం చేశారు.
ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో పొత్తులపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓట్లు చీలకూడదు అన్నదే తన అభిప్రాయమని పేర్కొన్నారు. బీజేపీతో ఇప్పటికే పొత్తులో ఉన్నామన్న పవన్.. ఆ పార్టీ కాదంటే ఒంటరిగా వెళ్తామని తెలిపారు. కొత్త పొత్తులు వస్తే ఆ పార్టీలతో కలిసి ముందుకు వెళ్తామన్న ఆయన.. ఎన్నికల ముందు పొత్తులపై స్పష్టత వస్తుందని చెప్పారు. అందరూ కలిసి రావాలని కోరుకుంటున్నానని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి 175 సీట్లు వస్తాయన్న నమ్మకం ఉంటే.. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వానికి రోజురోజుకూ విశ్వాసం సన్నగిల్లుతోందని విమర్శించారు. లోకేశ్ పర్యటన, తన పర్యటనను అడ్డకుంటే వారికి నమ్మకం లేనట్లేనని పవన్ వ్యాఖ్యానించారు.
"పొత్తులపై స్పష్టత ఎన్నికల ముందు వస్తుంది. బీజేపీతో ఇప్పటికే పొత్తులో ఉన్నాం. ఆ పార్టీ కాదంటే ఒంటరిగా వెళ్తాం. కొత్త పొత్తులు వస్తే ఆ పార్టీలతో కలిసి వెళ్తాం. అందరూ కలిసి రావాలని కోరుకుంటున్నా. 175 సీట్లు వస్తాయన్న నమ్మకం ఉంటే.. జగన్ ప్రభుత్వం ఇవన్నీ ఎందుకు చేస్తోంది. వైఎస్ఆర్సీపీకి విశ్వాసం సన్నగిల్లుతోంది. లోకేశ్ పర్యటన, నా పర్యటనను అడ్డకుంటే వారికి నమ్మకం లేనట్లే." - పవన్ కల్యాణ్, జనసేన అధినేత
సాయంత్రం నాచుపల్లి సమీపంలోని ఓ రిసార్టులో తెలంగాణ ముఖ్య నాయకులతో జనసేన అధినేత సమావేశమవుతారు. అక్కడి నుంచి ఆయన ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చేరుకుంటారు. అక్కడ స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడి నుంచే అనుష్టుప్ నారసింహ యాత్రకు పవన్ శ్రీకారం చుడతారు. దీనిలో భాగంగా 31 నారసింహ క్షేత్రాలను ఆయన దశల వారీగా సందర్శించనున్నారు. ధర్మపురిలో దర్శనం అనంతరం ఆయన హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.
పవన్ పర్యటన నేపథ్యంలో కొండగట్టు, ధర్మపురి ఆలయ పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పవన్ కొండగట్టు పర్యటన నేపథ్యంలో ఉదయం హైదరాబాద్‌లోని ఆయన నివాసం వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు.
ఇవీ చూడండి..