ఒకవైపు ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యనందిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఆచరణకు మాత్రం నోచుకోవడం లేదని జగిత్యాల జిల్లా బీసీ గురుకులంను చూస్తే అర్ధమవుతోంది. జిల్లాలోని కోరుట్ల గురుకులం నుంచి 380 విద్యార్థులను వారి తల్లిదండ్రులు తీసుకెళ్లారు.
అసలేం జరిగిందంటే...?
ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో 7, 8, 9 తరగతులు నడుస్తుండగా... ఇందులో సుమారు 380 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
పాఠశాలలో సరైన విధంగా మౌలిక వసతులు లేకపోవడం వల్ల నిత్యం ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం అవస్థలు పడుతున్న విషయాలను పిల్లలు వారి తల్లిదండ్రులకు గోడు వెళ్లబోసుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాఠశాల వద్దకు తరలి వచ్చి ఆందోళన చేశారు.
విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని ధర్నా నిర్వహించారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాల నుంచి తీసుకువెళ్లారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు వెళ్లి పాలనాధికారిని కలిసి సమస్యలు విన్న విస్తామని తల్లిదండ్రులు తెలిపారు. ప్రభుత్వాన్ని నమ్ముకుని గురుకుల పాఠశాలకు పంపిస్తే సౌకర్యాలు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారని.. అసలే కరోనా సమయం నడుస్తుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందో భయం భయంగా ఉందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పట్టించుకోని పూర్తిస్థాయిలో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని కోరారు.
ఇదీ చూడండి: దేశంలో ఎక్కడా లేనివిధంగా గురుకులాలు: కేటీఆర్