Kalvakuntla kavitha about bjp and congress: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస గెలుపు లాంఛనమేనని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో పర్యటించిన ఆమెకు.... గులాబీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. స్థానిక సంస్థల్లో . భాజపా, కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలకు బలం లేనందున.... ఆయా పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు సైతం తెరాసకు మద్దతునివ్వాలని ఆమె కోరారు. ఎమ్మెల్సీలుగా అవకాశంరాని వారు నిరాశ చెందాల్సిన అవసరం లేదన్న కవిత.... పార్టీలో అందరికీ అవకాశం లభిస్తుందని తెలిపారు.
అంతకుముందు నిజామాబాద్ నుంచి కొండగట్టు అంజన్న దర్శనానికి వెళ్తున్న కవిత... మార్గమధ్యలో మోర్తాడ్ వద్ద కాసేపు ఆగారు. మోర్తాడ్ వద్ద కవితకు తెరాస కార్యకర్తలు స్వాగతం పలికారు. నిజామాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కవిత ఈ సందర్భంగా తెలిపారు.
తెరాస నాయకులు, ప్రజాప్రతినిధులు.. ఎమ్మెల్సీలుగా అవకాశంరాని వారు నిరాశ చెందాల్సిన అవసరంలేదు. ఏదో ఒక క్రమంలో ఓపికగా ఉంటే తప్పకుండా అవకాశాలు వస్తాయని తెరాస అనేక సందర్భాల్లో గుర్తు చేసింది. ఇప్పుడు జరిగే అవకాశాల్లో 80శాతంపైగా పార్టీ ప్రజాప్రతినిధులే ఉన్నారు. తప్పకుండా విజయం తెరాసదే. ఈ విషయాన్ని గుర్తించి మిగతాపార్టీల ప్రజాప్రతినిధులు కూడా తెరాసకే మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను. జాతీయ పార్టీలు భాజపా, కాంగ్రెస్ కేవలం రెండు, మూడు జిల్లాలోనే పోటీ చేస్తున్నాయి. ఎన్నిక లాంఛనమే అయినా కూడా ఎన్నికల ప్రక్రియ మరింత సులువుతరం చేయడం కోసం సహకరించాలని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను కోరుతున్నాను.
-కవిత, ఎమ్మెల్సీ
జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామిని ఎమ్మెల్సీ కవిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ముందుగా బేతాళుని ఆలయాన్ని దర్శించుకున్న కవిత... అనంతరం అంజన్నను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం... అర్చకులు ఆమెకు స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటం అందించారు. ఆలయంలో జరుగుతున్న రామకోటి స్తూపం నిర్మాణ పనులు, కోనేరును ఆమె పరిశీలించారు. కొండగట్టు ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని కవిత హామీ ఇచ్చారు. మరోసారి ఎమ్మెల్సీగా తనకు అవకాశమిచ్చిన సందర్భంగా అంజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ఆలయంలో అభివృద్ధి పనులు సాగుతున్నాయని స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
ఇదీ చదవండి: Central govt about TS paddy procurement: తెలంగాణలో ధాన్యం కొంటాం: కేంద్రం