పసుపు బోర్డు ఏర్పాటు చేయకపోతే రాజీనామా చేస్తానన్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట మార్చారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. రాజీనామా చేస్తానని బాండ్ పేపర్ రాసిచ్చిన అర్వింద్... మీడియా ముందు ప్రగల్భాలు పలకడం కాకుండా రైతుల వద్దకు వెళ్లి వాళ్ల సమస్యలను చూడాలన్నారు.
జగిత్యాలలో పసుపు పండితే తమిళనాడులో పసుపు బోర్డు పెడతారా అని జీవన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. అర్వింద్ మాటల గారడితో రైతులను ముంచారని ఆరోపించారు. పసుపునకు రూ.15,000 మద్దతు ధర ఇస్తే పాలాభిషేకం చేస్తామన్నారు. ముఖ్యమంత్రికి మల్లన్న సాగర్ ముచ్చట తప్ప ఇంకో ముచ్చట లేదని... చక్కెర ఫ్యాక్టరీ మూసివేసి రైతులను ఇబ్బందికి గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపునకు మద్దతు ధర వచ్చేలా ప్రభుత్వాలు కృషి చేయాలని సూచించారు.